'క్యాలీ ఫ్లవర్' పోస్టర్ తెగ టెన్షన్ పెట్టేసింది

Update: 2021-11-20 11:36 GMT
తెలుగు తెరపై సందడి చేస్తున్న కామెడీ కథానాయకులలో సంపూర్ణేశ్ బాబు ఒకరు. కామెడీలో తనదైన మార్కును నిలబెట్టుకుంటూ .. తనకి గల క్రేజ్ ను కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నాడు. బడ్జెట్ తక్కువే అయినా కంటెంట్ పరంగా ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్విస్తున్నాడు. నిర్మాతలకు లాభాలు వచ్చేలా చూడగలుతున్నాడు. ఆ మధ్య వచ్చిన 'కొబ్బరి మట్ట' సినిమాలో 'పెదరాయుడు' గెటప్ లో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో స్త్రీ గురించి గుక్క తిప్పుకోకుండా 3 నిమిషాల డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పి షాక్ ఇచ్చాడు.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'క్యాలీ ఫ్లవర్' సిద్ధమైంది. ఈ సినిమాలో ఆయన రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నాడు. బ్రిటీష్ ఆఫీసర్ పాత్ర మాత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆశాజ్యోతి నిర్మించిన ఈ సినిమాకి ఆర్ కె మలినేని దర్శకత్వం వహించాడు. సంపూ జోడీగా 'వాసంతి' నటించిన ఈ సినిమాలో, పోసాని ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ప్రజ్వల్ క్రిష్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సంపూ బిజీగా ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి సంపూ మాట్లాడుతూ .. "ఒక అమాయకుడు .. పద్ధతి కలిగిన ఒక కుర్రాడు ఒక ఊళ్లో ఉంటాడు. అతను బ్రిటీష్ అధికారి మనవడు .. ఒక ఆశయంతో బ్రతుకుతూ ఉంటాడు. తనకి పెళ్లి కుదరడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో తాగేసిన మత్తులో ఉన్న ఒక ముగ్గురు అమ్మాయిలు అతనిని రేప్ చేస్తారు. తనని పాడుచేశారనే పగతో ఆ ముగ్గురి కోసం గాలించడం మొదలు పెడతాడు. అప్పటి నుంచి కథలో అనూహ్యమైన .. హాస్యభరితమైన మలుపులు చోటు చేసుకుంటాయి.

బ్రిటిష్ అధికారిగా .. ఆయన మనవడిగా ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాను. నాకు బ్రిటీష్ అధికారి రోల్ బాగా నచ్చింది. మేకప్ వేసుకోవడానికే రెండు గంటలకి పైగా పట్టేది. బ్రిటీష్ వాళ్లు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో .. ఆ యాసలో మాట్లాడానికి కాస్త కష్టపడవలసి వచ్చింది. నేను వంటిపై బట్టలు లేకుండా 'క్యాలీ ఫ్లవర్' మాత్రమే అడ్డుపెట్టుకున్న పోస్టర్ ను 'పీకే' పోస్టర్ స్ఫూర్తితోనే డిజైన్ చేశారు. బాగా పాప్యులర్ అయిన ఆ పోస్టర్ స్టైల్లో ఎవరూ ట్రై చేయలేదు. మా డైరెక్టర్ గారు ఆ పాయింట్ పట్టుకుని అలా చేయించారు.

ఒక ఫైట్ సీన్ సందర్భంలో నేను అలా చేయవలసి వస్తుంది. ఆ సీన్ చేసినప్పుడు నాకు ఏమీ అనిపించలేదు గానీ, ముందుగా నాకు పోస్టర్ పంపించినప్పుడు మాత్రం భయమేసింది. జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో .. ఏమో. ఇలా చేయడం కరెక్టేనా .. కాదా? అనే ఒక సందిగ్ధంలో పడిపోయాను. పోస్టర్ వదిలిన తరువాత అందరూ నవ్వుకున్నారు .. మంచి రెస్పాన్స్ రావడంతో హమ్మయ్య అనుకున్నాను" అని చెప్ప్పుకొచ్చాడు.
Tags:    

Similar News