సముద్రఖని రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉందా?

Update: 2021-08-10 10:33 GMT
తెలుగులో తమిళనటుల ప్రభావం పెరుగుతూ పోతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్లును ముంబై నుంచి దిగుమతి చేసుకునేవారు. కానీ ఈ మధ్య ఇక్కడ తమిళ నటులను విలన్లుగా తీసుకోవడమనేది పెరుగుతూ వెళుతోంది. అరవిందస్వామి .. విజయ్ సేతుపతి .. సముద్రఖని వంటివారు విలన్లుగా ఇక్కడ మంచి మార్కులను కొట్టేశారు. అరవిందస్వామి కార్పొరేట్ విలనిజంలో బాగా మెప్పిస్తారు. ఇక విజయ్ సేతుపతి .. సముద్రఖని ఇద్దరూ కూడా మాస్ విలనిజాన్ని బాగా పండిస్తారు. ఇటీవల వారు చేసిన సినిమాలే అందుకు నిదర్శనం.

తమిళంలో దర్శకుడిగా సముద్రఖని మంచి పేరు ఉంది. అయితే ప్రస్తుతం ఆయన నటుడుగా ఫుల్ బిజీ. తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోను కీలకమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. 'అల వైకుంఠపురములో' సినిమాలో ఆయన పోషించిన అప్పలనాయుడు పాత్ర జనంలోకి బాగా వెళ్లింది. అలాగే 'క్రాక్ 'సినిమాలో కటారి కృష్ణ పాత్రలోను ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. చాలా తక్కువ డైలాగులతో .. చురుకైన చూపులతో విలనిజాన్ని పండించడం ఆయన ప్రత్యేకత. కొత్తదనంతో కూడిన ఆ తరహా విలనిజమే ఇక్కడి ఆడియన్స్ కి బాగా నచ్చింది.

త్రివిక్రమ్ ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సముద్రఖని చేసిన ఈ రెండు సినిమాలు భారీ విజయాలను సాధించడం వలన, ఆయనకి ఇక్కడి నుంచి మరిన్ని అవకాశాలు వెళుతున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్'లో ఒక కీలకమైన పాత్రను చేసిన ఆయన, గోపీచంద్ మలినేని తాజా చిత్రంలోను ఒక పవర్ఫుల్ రోల్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన తేజ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఇంకా తేలలేదనేది మరో టాక్.

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో అభిరామ్ హీరోగా తేజ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం సముద్రఖనిని సంప్రదించారట. అయితే ఆయన చెప్పిన పారితోషికం ఈ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ కి ఎక్కువనే అభిప్రాయంతో సురేశ్ బాబు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆ పాత్రను ఆయన చేయడం వలన వచ్చే రెస్పాన్స్ వేరేగా ఉంటుందంటూ సురేశ్ బాబును ఒప్పించే ప్రయత్నంలో తేజ ఉన్నాడని అంటున్నారు. సముద్రఖనికి గల డిమాండ్ కారణంగా ఆయన పారితోషికం ఒక రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. అయితే అభిరామ్ కి ఇది తొలి సినిమా కనుక, తేజ నిర్ణయానికి సురేశ్ బాబు ఓకే చెప్పొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags:    

Similar News