రానా జోడీగా మలయాళ మనోహరి!

Update: 2021-10-03 06:22 GMT
పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూనే 'వకీల్ సాబ్' వంటి రీమేక్ సినిమాతో హిట్ కొట్టేశారు. వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేశారు. ఆ తరువాత ఆయన మలయాళ మూవీ రీమేక్ గా 'భీమ్లా నాయక్' చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇక మరో ప్రధానమైన పాత్రలో రానా కనిపించనున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ ను తీసుకున్నారు. ఆమెకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను కూడా పూర్తిచేశారు. ఇక రానా జోడీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉంది.

రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ ను అనుకున్నారు .. తీసుకున్నారు కూడా. అయితే ఆమె కాంబినేషన్లో సీన్లు వాయిదా వేయడం వలన, మళ్లీ ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోయింది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె తమిళంలో నాయిక ప్రధానమైన సినిమాలు ఎక్కువగా చేస్తోంది. అందువలన ఆమె ఆ సినిమాలను పూర్తి చేయడం పైనే పూర్తి దృష్టి పెట్టింది.
దాంతో అప్పటి నుంచి ఈ సినిమా కోసం చాలామంది కథానాయికల పేర్లను పరిశీలించారు. ఆ జాబితాలో తమిళ నాయికల పేర్లు ఎక్కువగా వినిపించాయి .. కానీ ఎవరూ కూడా సెట్ కాలేదు.

ఈ నేపథ్యంలోనే మలయాళ మందారం 'సంయుక్త మీనన్'ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె ఈ సినిమా  చేయడానికి అంగీకరించడం .. అగ్రిమెంట్ పై సైన్ చేయడం కూడా జరిగిపోయింది. ఈ సినిమాను తాను చేయనున్నట్టు ఆమె కూడా ధృవీకరించింది. పవన్ సినిమాలో .. రానా సరసన నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పింది. ఇంతవరకూ సంయుక్త మీనన్ తమిళ ... మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం 'బింబిసార'. ఈ సినిమాలో ఆమె కల్యాణ్ రామ్ సరసన కనిపించనుంది. ఆ సినిమా విడుదల కాకముందే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చేసిందన్న మాట.

ఇక 'భీమ్లా నాయక్' కోసం రానా - సంయుక్త మీనన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే పవన్ - రానా కాంబినేషన్ .. సముద్రఖని కాంబినేషన్ సీన్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయని అంటున్నారు. వాటితో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. కానీ 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ దగ్గరగా ఉండటంతో, 'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ సినిమా తరువాత పవన్ .. క్రిష్ ప్రాజెక్టు 'హరి హర వీరమల్లు'పైకి వెళ్లనున్నారు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎం.రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వజ్రాల దొంగగా ఈ సినిమాలో పవన్ కనిపించనున్నారని అంటున్నారు. మొగల్ చక్రవర్తుల కాలంనాటి కథ కావడంతో, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే భారీ సెట్లు ఆల్రెడీ వేయడం మొదలుపెట్టారు. పవన్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుండటం, ఆయన కెరియర్లోనే తొలి చారిత్రక చిత్రం కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక రానా విషయానికి వస్తే ఆయన చేసిన 'విరాటపర్వం' విడుదల కోసం వెయిట్ చేస్తోంది. ఒక వెబ్ సిరీస్ తోను ఆయన బిజీ కానున్నారు. 
Tags:    

Similar News