సంక్రాంతి 2023.. ఆల్ హ్యాపీస్

Update: 2023-01-21 23:30 GMT
ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ఏదీ పూర్తి సంతృప్తినివ్వ‌లేదు. అన్ని సినిమాల్లోనూ లోపాలున్నాయి. కానీ వాటిని న‌మ్ముకున్న అంద‌రూ చాలా సంతోషంగానే ఉన్నారు. నిర్మాత‌లు కానీ.. బ‌య్య‌ర్లు కానీ పెద్ద‌గా న‌ష్ట‌పోయింది లేదు. ఈ పండ‌క్కి అంద‌రి దృష్టీ నిలిచింది చిరంజీవి సినిమా వాల్తేరు వీర‌య్య‌, బాల‌కృష్ణ మూవీ వీర‌సింహారెడ్డిల మీదే.

ఇవి రెండూ కూడా బాక్సాపీస్ ద‌గ్గ‌ర అంచ‌నాల్ని మించి ఆడేశాయి. వాల్తేరు వీర‌య్య అదిరిపోయే వసూళ్ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ రేంజిని అందుకుంది. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి ప్ర‌పంచ‌వ్యాప్తంగా బ‌య్య‌ర్ల‌ను సేఫ్ జోన్లోకి తెచ్చేసింది. రెండో వీకెండ్లో కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టేలా క‌నిపిస్తున్న ఈ చిత్రం ఫుల్ ర‌న్లో బ‌య్య‌ర్ల‌కు మంచి లాభాల‌ను అందించేలా ఉంంది. ఇక వీర‌సింహారెడ్డి తొలి రోజే మెజారిటీ షేర్ తెచ్చుకోవ‌డంతో... ఆ త‌ర్వాత జోరు త‌గ్గినా ఇబ్బంది లేక‌పోయింది.

ఐతే బి, సి సెంట‌ర్ల‌లో ఇప్ప‌టికీ ఆ చిత్రం మంచి షేర్ తెచ్చుకుంటోంది. రెండో వీకెండ్ అయ్యేస‌రికి ఆ చిత్రం కూడా లాభాల బాట ప‌డుతున్న‌ట్లే. మొత్తంగా ఈ రెండు పెద్ద సినిమాలూ అంద‌రినీ సంతోషంలో ముంచెత్తాయి. దిల్ రాజు అనువాద చిత్రం వార‌సుడు లేటుగా బ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ.. దాని స్థాయిలో అది మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. చిరు, బాల‌య్య‌ల సినిమాల ఓవ‌ర్ ఫ్లోస్ దీనికే బాగా క‌లిసొచ్చాయి. తెలుగులో విజ‌య్ సినిమాల్లో అత్య‌ధిక షేర్ సాధించిన చిత్రంగా వార‌సుడు నిల‌వ‌బోతోంది.

దీంతో పాటు వ‌చ్చిన అనువాద చిత్రం తెగింపు దాని స్థాయిలో మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. త‌క్కువ పెట్టుబ‌డి కావ‌డం వ‌ల్ల అది కూడా బ్రేక్ ఈవెన్ అయింది. క‌ళ్యాణం క‌మ‌నీయం కంటెంట్ ప‌రంగా నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికీ.. కొంత‌మేర ఓవ‌ర్ ఫ్లోస్ క‌లిసొచ్చి ఓ మోస్త‌రు వ‌సూళ్లు రాబ‌ట్టింది. దాన్ని యువి వాళ్లు సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఓటీటీ హ‌క్కుల‌తోనే ఆ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసింది. కాబ‌ట్టి యువి వాళ్లు న‌ష్ట‌పోయిందేమీ లేదు. కాబ‌ట్టి సంక్రాంతికి ఆల్ హ్యాపీస్ అన్న‌ట్లే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News