మూవీ రివ్యూ ; ‘సార్పట్ట’

Update: 2021-07-22 06:18 GMT
మూవీ రివ్యూ ; ‘సార్పట్ట’

నటీనటులు: ఆర్య-దుషార-పశుపతి-జాన్ కొక్కెన్-జాన్ విజయ్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: మురళి.జి
నిర్మాత: షణ్ముగం దక్షణ్ రాజ్
రచన-దర్శకత్వం: పా.రంజిత్

కరోనా టైంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో కొత్త సినిమా ‘సార్పట్ట’. సూపర్ స్టార్ రజినీ కాంత్ తో కబాలి, కాలా సినిమాలు రూపొందించిన పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటించిన బాక్సింగ్ డ్రామా ఇది. అమేజాన్ ప్రైమ్ ద్వారా తెలుగులోనూ ఒకేసారి విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

70వ దశకంలో మద్రాసులో బాక్సింగ్ సంస్కృతి బాగా విస్తరించిన సమయంలో తమ ప్రాభవం కోల్పోతున్న ‘సార్పట్ట’ అనే బాక్సింగ్ గ్రూప్.. తమ పరువు నిలబెట్టే బాక్సర్ కోసం చూస్తుంటుంది. ఈ బృందాన్ని నడిపించే మాజీ బాక్సర్ రంగయ్య (పశుపతి) తనను సవాల్ చేసిన ప్రత్యర్థి బృందం బాక్సర్ వేటపులి (జాన్ కొక్కెన్) మీదికి బాక్సరే అయిన తన కొడుకును కూడా కాదని రాముడు అనే మరో బాక్సర్‌ను నిలబెడతాడు. కానీ అతను అడ్డం తిరిగి రంగయ్యను అవమానిస్తాడు. దీంతో రంగయ్యను ఎంతో గౌరవించే సమర (ఆర్య) రాముడిని సవాల్ చేసి తనతో పోటీకి సై అంటాడు. ఎవ్వరూ ఊహించని విధంగా రాముడిని చిత్తుగా ఓడించిన సమర.. వేటపులితో పోరుకు సై అంటాడు. భారీ అంచనాల మధ్య వీరి పోరుకు రంగం సిద్ధమవుతుంది. మరి ఈ పోరులో సమర గెలిచాడా.. ఈ బౌట్ తర్వాత అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఇండియాలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామాలను పరిశీలిస్తే కథలన్నీ చాలా వరకు ఒకేలా కనిపిస్తాయి. ముందు హీరో ఒక సామాన్యుడిలా కనిపిస్తాడు. అతనేదో సాధిస్తాడని ఎవరికీ అంచనాలు ఉండవు. కానీ ఒక బలమైన మూమెంట్లో అతడిలో కసి పెరుగుతుంది. దీంతో హీరోలోని మరో కోణం బయటపడుతుంది. ఒక ఎమోషన్ తో అతను లక్ష్యం వైపు అడుగులు వేస్తాడు. అన్ని అడ్డంకులనూ దాటి విజేతగా నిలుస్తాడు. ‘సార్పట్ట’ కూడా కొంచెం అటు ఇటుగా ఇలాంటి కథే. బాక్సింగ్ నేపథ్యంలో ఇండియాలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి కానీ.. ‘సార్పట్ట’కు 70వ దశకం నాటి నేపథ్యాన్ని ఎంచుకోవడం.. మద్రాసులో అప్పటి బాక్సింగ్ సంస్కృతిని అథెంటిగ్గా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరగడం ఇందులోని ప్రత్యేకతలు. ఐతే స్పోర్ట్స్ డ్రామాలకు అత్యంత కీలకమైన ‘ఎమోషన్’ మాత్రం ఇందులో మిస్సయింది. ఆరంభంలో ఆసక్తికరంగానే అనిపించినా.. కథలో- పాత్రల్లో ఒక నిలకడ అంటూ లేకపోవడం.. విపరీతమైన సాగతీత.. లాజిక్ లేని, అనవసర సన్నివేశాలు.. ‘సార్పట్ట’ను ఒక మంచి సినిమా కాకుండా చేశాయి. అన్నింటికీ మించి తెలుగు ప్రేక్షకులు ఇది మన సినిమా అని ఫీలయ్యే అవకాశం ఎక్కడా లేదు. పూర్తిగా తమిళ టచ్ తో సాగే ‘సార్పట్ట’ మనవాళ్లకు రుచించడం కష్టమే.

‘సార్పట్ట’ మొదట్లో ఆసక్తికరంగానే అనిపిస్తుంది. దర్శకుడు పా.రంజిత్ ఆరంభ సన్నివేశాలతోనే నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. బాక్సింగ్ రింగ్ లో చెలరేగిపోతున్న విలన్ని రంగంలోకి దించి.. హీరో టార్గెట్ ఏంటో తొలి సన్నివేశంలోనే చూపించేశాడు. హీరో మనకు బాక్సర్ గా కాకుండా మామూలుగా పరిచయం అయినప్పటికీ.. తర్వాత అతను బాక్సర్ అవుతాడని.. ఆ విలన్ని ఢీకొంటాడని అర్థమైపోతుంది. ఐతే బాక్సింగ్ చూడటానికే పరిమితం అవుతున్న హీరో.. రింగులోకి ఎలా అడుగు పెడతాడన్న ఆసక్తి మొదలవుతుంది. బాక్సర్ అయిన హీరో తండ్రి ఆ ఆట వల్లే ప్రాణాలు కోల్పోయాడన్న బాధతో హీరోను అతడి తల్లి బాక్సింగ్ కు దూరంగా పెట్టడం.. కానీ తన రక్తంలోనే బాక్సింగ్ ఉండటంతో హీరో చివరికి ఆ ఆటలోకి అడుగుపెట్టడం.. ఈ థ్రెడ్ ఆకట్టుకుంటుంది. ఐతే హీరో బాక్సింగ్ నేర్చుకోవడం కానీ.. అందుకోసం సాధన చేయడం కానీ ఏమీ చూపించకుండా.. ఉన్నట్లుండి గ్లవ్స్ తొడుక్కుని తమ బృందంలో ఉన్న అత్యుత్తమ బాక్సర్ ను చితక్కొట్టి ఆసుపత్రి బెడ్ ఎక్కించడమే అతిగా అనిపిస్తుంది. కేవలం చూసి నేర్చుకునే ఆట కాదు బాక్సింగ్. అందుకోసం ఎంతో కసరత్తు చేయాలి. ఏళ్ల తరబడి కష్టపడాలి. ఫిట్నెస్ కోసం పడే శ్రమ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ హీరో మాత్రం ఉన్నట్లుండి బాక్సర్ అయిపోతాడు. ఈ విషయం పంటికింద రాయిలా అనిపించినా.. హీరో తన సత్తాను చూపించే సన్నివేశాలను మాత్రం రంజిత్ చాలా బాగా తీశాడు. సినిమాలో మేజర్ హైలైట్ అంటే.. డ్యాన్సింగ్ రోజ్ అనే బాక్సర్ తో హీరో తలపడే ఎపిసోడే. డ్యాన్సింగ్ రోజ్ పాత్ర.. అతడితో హీరో తలపడే ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. వీరి మధ్య బాక్సింగ్ ఫైట్ ను చిత్రీకరించిన విధానం కూడా ఆకట్టుకుంటాయి. సినిమా మంచి రసపట్టులో పడుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ.

ఇక వేటపులితో హీరో పోరు దగ్గరికి వచ్చేసరికి ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఐతే ఈ బౌట్ మధ్యలో విచిత్రమైన రీతిలో ఆగిపోయిన దగ్గర్నుంచి ‘సార్పట్ట’ గాడి తప్పుతుంది. బాక్సింగ్ లో దెబ్బ తిన్నాక హీరో వ్యక్తిగతంగా పతనం అయ్యే సన్నివేశాలు చాలా బోరింగ్ గా ఉంటాయి. ‘సార్పట్ట’ పూర్తిగా ట్రాక్ తప్పేది ఇక్కడే. ఏవేవో సన్నివేశాలు వస్తాయి. ఏ పాత్ర ఏం చేస్తుందో అర్థం కాదు. హీరో పతనాన్ని చూపించడానికి ఎంచుకున్న సీన్లేవీ అంత ఆసక్తికరంగా లేవు. ప్రథమార్ధంలో బిగితో కనిపించే సినిమా కాస్తా.. రెండో అర్ధంలో తుస్సుమనిపించేస్తుంది. హిందీలో వచ్చిన ‘సుల్తాన్’ సహా కొన్ని స్పోర్ట్స్ డ్రామాలు పరిశీలిస్తే.. హీరో దారి తప్పడానికి బలమైన కారణాలు కనిపిస్తాయి. మళ్లీ ఆటలోకి రావడానికి దారి తీసే పరిస్థితులు కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయి. హీరో మళ్లీ ఏదో సాధించాలన్న తపన ప్రేక్షకుల్లోనూ కలుగుతుంది. కానీ ‘సార్పట్ట’లో అవే మిస్సయ్యాయి. ఎమోషనల్ కనెక్ట్ అన్నదే లేకపోవడంతో హీరో మళ్లీ బాక్సింగ్ గ్లవ్స్ తొడిగినా.. కష్టపడుతున్నా.. లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నా ప్రేక్షకుల్లో అంతగా కదలిక ఉండదు. తెరమీద బోలెడన్ని పాత్రలైతే కనిపిస్తాయి కానీ.. వాటిలో ప్రేక్షకులను ఆకట్టుకునేవి తక్కువే. ఏ పాత్రకూ సరైన క్యారెక్టరైజేషనే లేదు. వాటితో ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టమే. ఎమర్జెన్సీతో పాటు అప్పటి తమిళ రాజకీయాల గురించి కూడా కొంత చర్చ జరిగింది కానీ.. అదంతా మొక్కుబడి వ్యవహారంలా ఉంటుంది. కథ పరంగా ద్వితీయార్ధంలో ఏ ఆసక్తీ కనిపించదు. సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూడటం తప్ప ఏ ఎగ్జైట్మెంట్ ఉండదు. వేటపులి-సమర మధ్య పతాక సన్నివేశాన్ని చాలా సాధారణంగా తీసేసి మమ అనిపించేశాడు రంజిత్. ఈ కథను మరీ మూడు గంటల పాటు చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. కనీసం 40 నిమిషాల నిడివి తగ్గాల్సింది. అన్ని అనవసర సన్నివేశాలున్నాయిందులో. ప్రథమార్ధంలో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు.. వాటి చుట్టూ నడిచే డ్రామా మినహాయిస్తే ‘సార్పట్ట’లో అంత విశేషం ఏమీ లేదు. తమిళ జనాల సంగతేమో కానీ.. మనవాళ్లకు మాత్రం ఇది రుచించడం కష్టం.

నటీనటులు:

బాక్సింగ్ నేపథ్యంలో ఒక అథెంటిక్ మూవీ అంటే హీరో కష్టం మామూలుగా ఉండదు. బాడీ మార్చుకోవాలి. బాక్సింగ్ నేర్చుకోవాలి. నిజమైన బాక్సర్ అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించాలి. ఈ విషయంలో ఆర్య నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ఎక్కడా కూడా పాత్రకు సూటవ్వలేదు అన్న భావనే కలిగించలేదు. కళ్లు చెదిరే ఆహార్యం.. రియల్ బాక్సర్ అనిపించేలా రింగులో కదలికలతో అతను ఆకట్టుకున్నాడు. నటన కూడా బాగుంది. అతడి తర్వాత ఎక్కువగా మెప్పించేది పశుపతి. తన అనుభవాన్ని చూపిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడతను. హీరోయిన్ దుషార పాత్రకు తగ్గట్లుగా కనిపించింది, నటించింది. ఆర్యను ఢీకొట్టే బాక్సర్ వేటపులిగా జాన్ కొక్కెన్ కూడా బాగా చేశాడు. డాడీ పాత్రలో జాన్ విజయ్ ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం:

ఇలాంటి ఇంటెన్స్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా కీలకం. ఆ విషయంలో సంతోష్ నారాయణన్ నిరాశ పరచలేదు. తన స్టైల్లో ఒక రకమైన ఆర్ఆర్ ఇచ్చాడతను. తమిళ టచ్ ఎక్కువ కనిపించినప్పటికీ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటల్ని మాత్రం మనవాళ్లు భరించడం చాలా కష్టం. తమిళ వాసనలు మరీ గుప్పుమంటాయి. మురళి.జి ఛాయాగ్రహణం సాంకేతికంగా సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. ఆర్ట్ డైరెక్టర్ సహకారంతో అతను తొలి సన్నివేశం నుంచే మనల్ని 70వ దశకానికి తీసుకెళ్లిపోతాడు. బాక్సింగ్ దృశ్యాలను అతను అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాణ విలువలు చాలా బాగా కుదిరాయి. 70ల నాటి వాతావరణాన్ని, మనుషుల్ని చూపించడంలో శ్రద్ధ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. దర్శకుడు పా.రంజిత్ ఇప్పటిదాకా తాను తీసిన సినిమాలకు భిన్నమైన కథను ఎంచుకున్నాడు. మద్రాసులో ఒకప్పటి బాక్సింగ్ సంస్కృతి మీద అతను చాలా పరిశోధించే సినిమా తీసిన విషయం అర్థమవుతుంది. కానీ నేపథ్యం భిన్నమైందే అయినా.. కథలో మాత్రం పెద్దగా కొత్తదనం కనిపించదు. ఈ కథను అనుకున్నంత ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం అతను విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల నీరసం తెప్పించేసింది.

చివరగా: సార్పట్ట.. సుదీర్ఘంగా సా...గిన బాక్సింగ్ డ్రామా

రేటింగ్-2.5/5
Tags:    

Similar News