టాలెంటెడ్ హీరో.. బ్లఫ్ మాస్టర్

Update: 2018-07-03 17:30 GMT
‘జ్యోతిలక్ష్మీ’.. ‘క్షణం’.. ‘ఘాజీ’ లాంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలతో మంచి పేరే సంపాదించాడు సత్యదేవ్. అతను సోలో హీరోగా మారి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి తమిళ సూపర్ హిట్ మూవీ ‘శతురంగ వేట్టై’కి రీమేక్. ఈ చిత్రానికి తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’ అని పేరు పెట్టారు. ఇంతకుముందు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా ‘రోమియో’ అనే సినిమా తీసిన గోపీ గణేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రమేష్ పిళ్ళై నిర్మాత. సత్యదేవ్ సరసన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ భామ నందిత శ్వేత కథానాయికగా నటించింది. ఇందులో హీరో మోసాలు చేస్తూ బతికే కుర్రాడిగా కనిపిస్తాడు. అందుకే దీనికి ‘బ్లఫ్ మాస్టర్’ అని పేరుపెట్టారు.

‘శతురంగ వేట్టై’ తమిళంలో ట్రెండ్ సెట్టింగ్ హిట్‌గా నిలిచింది. త్రివిక్రమ్ సినిమా ‘అఆ’కు ఛాయాగ్రహణం అందించిన నటరాజన్ సుబ్రమణ్యన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించడం విశేషం. తమిళనాట జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ మధ్య హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రైస్ పుల్లింగ్.. అలాగే చైన్ మార్కెటింగ్ లాంటి మోసాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ‘ఖాకి’తో ఆకట్టుకున్న వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అది. ఆద్యంతం ఆసక్తికరంగా.. ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్నందుకుంది. మరి తెలుగులో ఈ చిత్రాన్ని ఎలా తీశారో చూడాలి. సత్యదేవ్ దీంతో పాటుగా ‘47 డేస్’ అనే మరో థ్రిల్లర్ మూవీలోనూ హీరోగా నటిస్తున్నాడు. అది కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
Tags:    

Similar News