సావిత్రి ఫెవ‌రేట్ స్వీట్‌ పంచిపెడుతున్నారు

Update: 2018-05-08 07:39 GMT
ఒక్కో సినిమాకి ప్ర‌మోష‌న్ ఒక్కోలా ఉంటుంది. అన్నింటి కంటే ముందు మీడియా వాళ్ల‌ని మిత్రులుగా మ‌లుచుకోవ‌డం ముఖ్యం. అందుకే బ‌న్నీ లాంటి స్టార్ హీరో కూడా మీడియా మిత్రుల కోసం ఇచ్చిన‌ స్పెష‌ల్ కాక్ టెయిల్ పార్టీ ఈ కోవ‌లోకి చెందిన‌దే. ఇప్పుడు ఇలాంటి ప్ర‌మోష‌న‌ల్ కాకా మొద‌లెట్టింది ‘మ‌హాన‌టి’ టీం. టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ జ‌ర్న‌లిస్టుల‌కి సావిత్రి మెచ్చిన స్వీట్ ని పంపిస్తోంది.

మ‌హానటి సావిత్రి బెల్లం పాకంలో జీడిప‌ప్పు వేసి చేసే స్వీట్ అంటే ఎంతో ఇష్ట‌మట‌. దీంతో ఆమె జీవిత క‌థ మీద తీస్తున్న బ‌యోపిక్ చిత్ర విడుద‌ల సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు ఇదే స్వీట్ బాక్సుల‌ను ప్ర‌త్యేకంగా పంపిస్తున్నారు. వీరితో పాటు మీడియా మిత్రుల కోసం కూడా ఈ స్వీట్ ప్యాక్ లు చేరుతున్నాయి. దీంతో పాటు ‘సావిత్ర‌మ్మ ఫెవ‌రెట్ స్వీట్‌... మీ స్వీట్ మెమొరీస్ అంత‌టినీ మ‌ళ్లీ గుర్తుకు తెస్తుంది’ అంటూ చిన్న కార్డు ముక్క జోడించారు. డబ్బాపైన ఆన్ స్క్రీన్ సావిత్రి కీర్తిసురేష్ మాయ‌బ‌జార్ స్టిల్ ఉంటే... గ్రీటింగ్ క‌మ్ ఇన్విటేష‌న్ కార్డు మీద ‘మ‌హాన‌టి’ సావిత్రి ఉంది. ‘ఈ నిజం క‌థ అని త‌ర‌త‌రాలు చ‌ద‌వ‌ని’ అంటూ రాసి... గొప్ప న‌టి జీవితాన్ని తెర‌పైన చూడ‌డానికి రండి అంటూ కీర్తిసురేష్‌- ప్రియాంక ద‌త్‌- స‌మంతా అక్కినేని- దుల్క‌ర్ స‌ల్మాన్‌- నాగ్ అశ్విన్‌- విజ‌య్ దేవ‌ర‌కొండ సంత‌కాలు ఉన్నాయి.

అయితే మీడియాని స్వీట్లు ఇచ్చి- పార్టీలు ఇచ్చి కాకా ప‌ట్టినంత మాత్రాన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించ‌దు. కంటెంట్ మాట్లాడాల్సిందే. ఇప్ప‌టికే చాలా సినిమాల విష‌యంలో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇప్పుడు ‘మ‌హాన‌టి’ విష‌యంలో ఏం జ‌రుగుతుందో ఆస‌క్తిగా చూస్తున్నారు సినీ జ‌నాలు. ఈ స్వీట్ బాక్సులు థియేట‌ర్ల‌లో టికెట్లు తెగ‌డానికి ఎంతవరకు ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలియాలంటే ఇంకో రోజు ఆగితే స‌రిపోతుంది.
Tags:    

Similar News