సంక్రాంతి సినిమాలకు సెకండాఫ్ గండం?

Update: 2019-12-16 04:51 GMT
ఇంటర్నేషనల్ సినిమాలకు ఇండియన్ సినిమాలకు ఉన్న పెద్ద తేడా ఏంటి అంటే డ్యాన్సులు.. పాటలు అంటారు.  అది నిజమే కానీ అది ప్రధానమైన తేడా కాదు. ఇంటర్నేషనల్ సినిమాలకు మనకు తేడా ఇంటర్వెల్.  వారికి ఇంటర్వెల్ ఉండదు. మనకు ఉంది.  దీంతో మన మేకర్స్ కు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాల్సిందే.  దీన్ని రఫ్ గా చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ అనుకోవచ్చు.

కొందరు ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ అని విడివిడిగా చూడకూడదు అంటారు కానీ అది వీలుకాదు.  అంతా కలిపి ఒకే కథ అయినా ఇంటర్వెల్ నుంచి చాలా సినిమాలకు కథాగమనం మారిపోతుంది. నిజానికి చాలా సినిమాల్లో  అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ప్రారంభమవుతుంది.  అప్పటిదాకా ఫస్ట్ హాఫ్ లో ఫుల్ టైం పాస్ వ్యవహారమే.  అందుకే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఆడియన్స్ ను కట్టిపడేయడం చాలా కష్టం. ఆ పని చెయ్యగలిగితే సినిమా హిట్టే.  ఈ సంక్రాంతికి రిలీజ్ కానున్న రెండు పెద్ద సినిమాలకు సెకండ్ హాఫ్ గండం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సంక్రాంతికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రిలీజ్ అవుతున్నాయి.  ఈ రెండు సినిమాల విజయం సెకండ్ హాఫ్ పైనే ఆధారపడి ఉందనే టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' విషయమే తీసుకుంటే మొదటి భాగంలో మిలిటరీ నేపథ్యం ఇంట్రోలో హీరోయిజం.. ట్రైన్ జర్నీలో ఫన్ అంతా పర్ఫెక్ట్ గా ఉందని అంటున్నారు. అయితే సినిమా కథకు కీలకం మాత్రం రెండవ భాగమేనట.  ఒక్కసారి మహేష్ సీమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుందట.  కామెడీ.. యాక్షన్ ఉన్నప్పటికీ ఎమోషన్ పైనే రన్ అవుతుందట.  ఈ ఎమోషన్ కనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం సినిమాకు తిరుగుండదని లేకపోతే ఇబ్బంది తప్పదని అంటున్నారు.

మరోవైపు అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలానే ఉందట.  ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా కామెడీపైనే రన్ చేస్తున్నారట. త్రివిక్రమ్ మార్క్ కామెడీతో పాటుగా బన్నీ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులు కూడా ఉన్నాయట.  కథలో భాగంగా ఇవి ప్రేక్షకులను మెప్పిస్తే సినిమా విజయం సాధిస్తుందని.. లేకపోతే దీనికి కూడా ఇబ్బంది తప్పదని అంటున్నారు.   ఈ లెక్కన రెండు సినిమాలకు సెకండాఫ్ కీలకం కానుంది.  ఈ గండం గట్టెక్కితే పండగ లేకపోతే లేదు.


Tags:    

Similar News