దేవాల‌యంలో కొలువుదీరిన విజ‌య నిర్మ‌ల‌!

Update: 2021-06-27 09:30 GMT
వందేళ్ల కు స‌మీపిస్తున్న తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది న‌టీమ‌ణులు వెలిగిపోయారు. అయితే.. చాలా మంది న‌టి పాత్ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ.. అతి కొద్ది మంది మాత్రం ఇత‌ర రంగాల్లోనూ ప్ర‌తిభ చాటుకున్నారు. అలాంటి అరుదైన వారిలో విజ‌య నిర్మ‌ల ఒక‌రు. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా వెలుగొందిన ఆమె.. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌లు విభాగాల్లో విశేష‌మైన సేవ‌లందించారు. నేడు ఆమె వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా విజ‌య నిర్మ‌ల చ‌రిత్ర‌ను ఓ సారి ప‌రిశీలిస్తే...

గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌లో జన్మించిన విజ‌య నిర్మ‌ల‌.. చిన్న‌త‌నంలోనే సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టారు. రావు బాల‌స‌ర‌స్వ‌తి గారి చొర‌వ‌తో ప్ర‌వేశించిన ఆమె 1957లో వ‌చ్చిన‌ ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రంలో చిన్ని కృష్ణుడి వేషం వేశారు. అలా మొద‌లైన సినీ ప్ర‌యాణం హీరోయిన్‌, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు, రాజ‌కీయ‌వేత్త‌, వ్యాపార వేత్త అంటూ.. అలా ముందుకే సాగిపోయింది.

ఆమెకు ఒకే ఒక్క కుమారుడు న‌రేష్‌. త‌ల్లి అంటే వ‌ల్ల‌మాలిన ప్రేమ చూపించే న‌రేష్‌.. చివ‌రి వ‌ర‌కు ఆమె వెన్నంటే ఉన్నారు. త‌న‌కు న‌ట‌న‌లో పాఠాలు నేర్పించ‌డం మొద‌లు.. జీవిత పాఠాలు నేర్పించ‌డం వ‌ర‌కూ అన్నింటా ఆమె పాత్ర ఎంతో ఉంద‌ని అంటారు. త‌న‌కు క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌డ‌డంలోనూ, న‌టుడిగా నేర్పు పొంద‌డంలోనే ఆమె కీల‌క పాత్ర అని చెబుతారు.

చివ‌రి రోజుల వ‌ర‌కు త‌న ప‌ని తానే చేసుకున్న విజ‌య‌నిర్మ‌ల‌.. జీవితంలో ఎన్న‌డూ ఒక‌రిపై ఆధార‌ప‌డలేద‌ని చెబుతారు. ఇక‌, అంద‌రినీ ఎంతో ప్రేమ‌గా చూసిన ఆమె.. చివ‌ర‌కు ప‌నివాళ్ల‌ను సైతం త‌న‌వాళ్ల మాదిరిగానే చూసింద‌ట‌. దాదాపు ప‌దేళ్ల కాలం త‌మ వ‌ద్ద ప‌నిచేసిన వారంద‌రికీ.. ఇళ్లు కూడా నిర్మించించి ఇచ్చింద‌ట‌.

త‌న జీవితం మొత్తం నిండిపోయిన అమ్మ‌కు ఏదైనా చేయాల‌ని భావించిన న‌రేష్‌.. ఆమెకు ఓ దేవాల‌యం కూడా నిర్మించాడు. దానికి ‘భువ‌న విజ‌యం’ అని పేరు పెట్టారు. అంతేకాదు.. అమ్మ పాదాలను ప్రింట్ తీయించి, బంగారు పాదాలను చేయించానని చెప్పారు నరేష్. అంతేకాదు.. తన పేరులో కూడా త‌ల్లిని చేర్చుకొని విజయకృష్ణ న‌రేష్ కుమార్ గా మారిపోయారు. ఆ విధంగా త‌ల్లిని త‌నలో భ‌ద్రంగా ప‌దిల ప‌రుచుకున్నాన‌ని చెబుతారు.
Tags:    

Similar News