ఆ హీరో ఔదార్యానికి హ్యాట్సాఫ్

Update: 2018-10-24 11:08 GMT
రెండు నెలల కిందట కేరళ వరదల సందర్భంగా ఉదారంగా స్పందిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు తెలుగు సినీ తారలు. ఐతే ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉపద్రవం వచ్చింది. తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలో సినీ తారలు మరోసారి స్పందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐతే పరిశ్రమ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. కొందరు తారలు మాత్రమే స్పందించారు. విరాళాలు ప్రకటించారు. చాలామంది ఏమీ స్పందించకుండా ఉండిపోయారు. ఇలాంటి తరుణంలో ఒక సీనియర్ హీరో ముందుకు వచ్చి కొంచెం పెద్ద స్థాయిలోనే విరాళం ఇచ్చాడు. ఆయన అంత పెద్ద మొత్తంలో సాయం ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

నిజానికి ఆ హీరో ఆర్థిక పరిస్థితి విషయంలో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. గత దశాబ్దంన్నర కాలంలో సినిమాల ద్వారా పోగొట్టుకున్నదే తప్ప సంపాదించిందేమీ లేదు. చాలా వరకు సొంతంగా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. చివరగా ఓ మంచి సినిమాతో పలకరించినప్పటికీ.. అది కూడా ఆయనకు ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. ఆయన కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఇలాంటి సమయంలోనూ తిత్లీ బాధితుల బాధ చూసి కరిగిపోయి విరాళం అందజేసినట్లుగా చెప్పుకుంటారు. ఓవైపు వందల కోట్ల ఆస్తులున్న వాళ్లు ఏమీ పట్టనట్లుగా సైలెంటుగా ఉంటే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా ఆ సీనియర్ హీరో తన దాతృత్వాన్ని చాటుకోవడం గొప్ప విషయమే. మరి ఆ హీరోను చూసి అయినా మిగతా వాళ్లు స్పందించి తిత్లీ బాధితుల్ని ఆదుకుంటారేమో చూడాలి.
Tags:    

Similar News