అగ్ర నిర్మాణ సంస్థ వెన‌క షాడో ప్లేయ‌ర్!

Update: 2021-11-06 10:30 GMT
టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ అగ్ర‌గామి నిర్మాణ సంస్థ‌లు భాగ‌స్వామ్య ఒప్పందాల‌తో భారీ చిత్రాల్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే కేట‌గిరీలో తెలుగు చిత్ర‌సీమ‌లో ఓ నిర్మాణ సంస్థ అంత‌ర్జాతీయ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇది సాహ‌సోపేత‌మైన అడుగు అయినా ప్ర‌శంసించ‌ద‌గిన‌ది.

ప్ర‌ఖ్యాత సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ టాలీవుడ్ అగ్ర‌గామి నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టి. అన‌తి కాలంలోనే అగ్ర హీరోల‌తో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగింది. మీడియం బ‌డ్జెట్ చిత్రాల నిర్మాణంతో మొద‌లైన నిర్మాణం సంస్థ నేడు స్టార్ హీరోల‌తో సినిమాలు నిర్మిస్తోంది. కంటెండ్ బేస్డ్ చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకుంది. `జెర్సీ` లాంటి చిత్రం ఆ సంస్థ కీర్తి ప్ర‌తిష్ఠ‌ల్ని పెంచింది. ఆ సినిమాకు జాతీయ అవార్డుల‌ను సైతం అందుకుని బాలీవుడ్ మీడియాలోనూ స‌ద‌రు సంస్థ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ మ‌రో అడుగు ముందుకేసింది.

ఈసారి ఏకంగా అంత‌ర్జాతీయ సినిమా నిర్మాణానికే పూనుకుంది. ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి. కె. చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `త‌మ‌రా` అనే కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించింది. ఈ సినిమా ని ఇంటర‌నేష‌న‌ల్ స్టాండ‌ర్స్డ్ లో తెర‌కెక్కించనున్నారు. ఇండో-ప్రెంచ్ నిర్మాణ సంస్థ‌ల స‌హ‌కారంతో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇలా అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ కీల‌క ప్ర‌క‌ట‌న వెన‌క‌ తెలుగు నిర్మాణ సంస్థ ఉండ‌టం గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ వార్త స‌ర్వత్రా ఆస‌క్తిని పెంచుతోంది. మ‌రి ఈ ప్రెంచ్ నిర్మాణ సంస్థ ఇప్పుడే తెర‌పైకి వ‌చ్చిందా? లేక షాడోలా సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఆరంభం నుంచి షాడోగా ఉందా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి.

`త‌మ‌రా` ఎలాంటి కంటెంట్ తో తెర‌కెక్కుతోంది? ఈ సినిమాని ఎన్ని భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు? న‌టీన‌టులు..మిగ‌తా సాంకేతిక నిపుణులు ఎవ‌రు? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది. వాటి వివ‌రాలు కూడా వీలైనంత త్వ‌ర‌గా రివీల్ చేస్తామ‌ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ తెలిపింది. ప్ర‌స్తుతం ఈ సంస్థ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..టాలీవుడ్ హంక్ రానా క‌థానాయ‌కులుగా `భీమ్లా నాయ‌క్` చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది మ‌ల‌యాళం సినిమా `అయ్య‌ప్పనం కోషియ‌మ్` కి రీమేక్ గా తెర‌కెక్కుతోంది. మాతృక‌లో సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో రీమేక్ వెర్ష‌న్ పైనా భారీ అంచ‌నాలున్నాయి. తొలి నుంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ ని ప్రోత్స‌హిస్తున్న సంస్థ ఇప్పుడు హాలీవుడ్ లో అడుగుపెడుతుండ‌డం అంద‌రిలో క్యూరియాసిటీని పెంచుతోంది. ప‌లు టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు బాలీవుడ్ లో అడుగుపెట్టి వ‌రుస చిత్రాల్ని నిర్మిస్తుంటే అందుకు భిన్న‌మైన ప్ర‌ణాళిక‌ను సితార సంస్థ ఆచ‌రించ‌డం ఆస‌క్తిక‌రం. సితార సంస్థ ఇప్ప‌టికే ఎన్నో అభిరుచి ఉన్న చిత్రాల్ని నిర్మించింది. ఇప్ప‌టికీ నిర్మిస్తోంది. మునుముందు ఇదే పంథాలో నేటిత‌రానికి అవ‌కాశాలు క‌ల్పిస్తూ ముందుకు సాగాల‌నే ఆకాంక్షిద్దాం.
Tags:    

Similar News