ఇదేనా బాలీవుడ్‌ను బతికించే సినిమా

Update: 2022-11-03 11:30 GMT
ఇండియాలో కరోనా మహమ్మారి మొదలైన దగ్గర్నుంచి బాలీవుడ్ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో తెలిసిందే. కరోనా ప్రభావాన్ని అన్ని ఫిలిం ఇండస్ట్రీలూ ఎదుర్కొన్నాయి కానీ.. బాలీవుడ్ తిన్న దెబ్బ అలాంటిలాంటిది కాదు. కరోనా టైంలో సుదీర్ఘ కాలం ఉత్తరాదిన థియేటర్లు మూతపడి ఉండడంతో విధి లేక చాలా సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేశారు. జనాలు వాటికి బాగా అలవాటు పడిపోయి థియేటర్లు తెరుచుకున్నాక కూడా వెండి తెరల వైపు చూడడం మానేశారు.

గత ఏడాది ఇదే టైంకి హిందీలో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోగా.. ఈ ఏడాది కాలంలో థియేటర్లలో బాగా ఆడిన బాలీవుడ్ సినిమాలు అరడజను కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘లాల్ సింగ్ చడ్డా’ సహా భారీ సినిమాలు చాలానే బోల్తా కొట్టాయి. సూర్యవంశీ, కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్ర లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే మంచి వసూళ్లు రాబట్టాయి. కానీ బాలీవుడ్‌ను తిరిగి నిలబెట్టడానికి ఈ సినిమాలు, ఈ ఊపు సరిపోలేదు. ‘బ్రహ్మాస్త్ర’ మంచి వసూళ్లే సాధించినా కూడా అది చివరికి ఫ్లాప్‌గానే నిలిచింది.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాల స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించే చిత్రం కోసం బాలీవుడ్ ఎదురు చూస్తోంది. ఆ లోటును తీరుస్తుందని తాజాగా బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘పఠాన్’ అనే చెప్పాలి. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేక, నాలుగేళ్లుగా అసలే సినిమా రిలీజ్ చేయక అభిమానులను నిరాశలో ముంచేసిన షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. షారుఖ్ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది.

తాజాగా రిలీజైన టీజర్ ఆ హైప్‌కు తగ్గట్లే ఫుల్ లెంగ్త్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్న భరోసా కలిగించింది. టీజర్లో విజువల్స్, షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షణ్ ఘట్టాలు అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. సిద్దార్థ్ ఆనంద్ ‘వార్ తరహా’ యాక్షన్ విందు చేయబోతున్నాడని స్పష్టమైంది. ఈ సినిమాతో మళ్లీ బాలీవుడ్‌కు కళ వస్తుందని.. ఒకప్పట్లా తొలి రోజు 50 కోట్లు, తొలి వీకెండ్లో వంద కోట్ల కలెక్షన్లు రావడం గ్యారెంటీ అని, ఫుల్ రన్లో నాలుగైదొందల కోట్లు కొల్లగొట్టడం పక్కా అని, మళ్లీ హిందీ ప్రేక్షకులు ఒకప్పట్లా థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయమని బాలీవుడ్ ఆశిస్తోంది.

అప్పుడే ట్రేడ్ పండిట్లు ఈ మేరకు అంచనాలు కట్టేస్తున్నారు. మరి వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ కానుకగా రిలీజవుతున్న ‘పఠాన్’ నిజంగా అంత సందడి చేస్తుందా.. షారుఖ్‌తో పాటు బాలీవుడ్‌కు కూడా పునర్వైభవాన్ని తెచ్చి పెడుతుందా అన్నది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News