‘గబ్బర్ సింగ్’లో అతడి కష్టమూ ఉందట

Update: 2018-06-09 14:30 GMT
పవన్ కళ్యాణ్ కెరీర్లో అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. దశాబ్దం పాటు నిఖార్సయిన హిట్టు లేక పవన్ ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చి ఆ సమయానికి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ గా నిలిచింది. ఇది రీమేక్ సినిమానే అయినప్పటికీ ఈ విజయంలో దర్శకుడు హరీష్ శంకర్ పాత్ర కీలకం. తెలుగు నేటివిటీకి.. పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా సినిమాలో చాలా మార్పులు చేర్పులు చేసి జనరంజకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు హరీష్. పవన్ ఇమేజ్ ను చాలా బాగా ఉపయోగించుకుని.. అభిమానులు అతడిని ఎలా చూడాలో అలా చూపించిన ఘనత హరీష్ కు చెందుతుంది. ఐతే ఈ సినిమా విజయంలో కమెడియన్ షకలక శంకర్ కు కూడా కొంచెం పాత్ర ఉందని అంటున్నాడు హరీష్. శంకర్ హీరోగా నటించిన ‘శంభో శంకర’ టీజర్ లాంచ్ సందర్భంగా అతనీ విషయాన్ని వెల్లడించాడు.

‘గబ్బర్ సింగ్’ షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుని రెడీగా ఉన్న సమయంలో అనుకోకుండా తొలి షెడ్యూల్ నెల రోజులు ఆలస్యం అయిందట. ఆ ఖాళీలో ఏం చేద్దామా అని ఆలోచించి.. సినిమాలో పవన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో చూపించేలా ఒక స్టోరీ బోర్డ్ వేద్దామనుకున్నాడట హరీష్. అప్పుడు శంకర్ అతడికి చాలా సాయపడ్డాడట. పవన్ ను యాజిటీజ్ గా అనుకరించే శంకర్.. తనకు చాలా హెల్ప్ అయ్యాడని.. అతను మంచి పెయింటర్ కావడంతో తాను ఏం చెబితే అది వెంటనే పర్ఫెక్టుగా స్కెచ్ వేసి ఇచ్చేసేవాడని హరీష్ తెలిపాడు. శంకర్ సాయంతో స్టోరీ బోర్డ్ చాలా బాగా రెడీ అయిందని.. దాన్ని తీసుకెళ్లి పవన్ కు చూపిస్తే చాలా సంతోషించి.. శంకర్ ను అభినందించాడని చెప్పాడు. తనకు పదేళ్ల కిందట్నుంచే శంకర్ తెలుసని.. ‘షాక్’ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడు నల్లమలుపు శ్రీనివాస్ ఆఫీసులో అతను పని చేసేవాడని హరీష్ చెప్పగా.. తాను అప్పుడు అక్కడ బాయ్ గా పని చేసేవాడినని శంకర్ వెల్లడించడం విశేషం.

Tags:    

Similar News