శంకర్ టీం లో రెహమాన్ లేడెందుకబ్బా..?

Update: 2019-01-15 16:36 GMT
కొంతమంది దర్శకులకు ఆస్థాన సంగీత దర్శకులు ఉంటారు.  మణిరత్నం ఎప్పుడూ ఎఆర్ రెహమాన్ లేకుండా అసలు సినిమా చెయ్యడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా దాదాపు అంతే.  తన సినిమాలకు రెహమాన్ ను తప్ప మరొకరిని ఎంచుకోడు.  శంకర్ - రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే.  'అపరిచితుడు'.. 'స్నేహితుడు' సినిమాలకు మాత్రం రెహమాన్ బిజీగా ఉండడంతో హ్యారిస్ జయరాజ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు.  తాజాగా శంకర్ మరోసారి ఎఆర్ రెహమాన్ ను కాకుండా మరో సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకొని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు.

'2.0' తర్వాత శంకర్ కమల్ హాసన్ తో 'ఇండియన్ 2' (తెలుగులో 'భారతీయుడు -2') ను తెరకెక్కిస్తున్నాడు.   సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 18 వ తేదీ నుంచి మొదలు పెడుతున్నాడని శంకర్ పోస్టర్ ద్వారానే వెల్లడించాడు. ఇక పోస్టర్లోనే టెక్నిషియన్ల వివరాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అని కన్ఫాం అయింది.  మరి ఎఆర్ రెహమాన్ ను ఎందుకు తీసుకోలేదనే విషయంలో ఇప్పుడు కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

రెహమాన్ ఎంత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ అయన ట్యూన్స్ మునుపటిలా చార్ట్ బస్టర్లు కావడం లేదు. '2.0' పాటలు కూడా పెద్దగా జనాలను మెప్పించలేదు.  అందుకే రెహమాన్ ను ఎంచుకోకుండా తమిళంలో ప్రస్తుతం నెంబర్ స్థానంలో ఉన్న అనిరుధ్ రవిచందర్ తీసుకున్నాడని అంటున్నారు.   ఒకవేళ క్వాలిటీ విషయంలోనే రెహమాన్ ను పక్కనబెట్టి ఉంటే మాత్రం రెహమాన్ మరో సారి తన సత్తా చాటాల్సిన సందర్భం వచ్చినట్టే. 
Tags:    

Similar News