'శ్రీకారం' దెబ్బకి శర్వానంద్ డీలాపడిపోయాడా?

Update: 2021-03-27 01:30 GMT
శర్వానంద్ మంచి నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన కథల ఎంపిక బాగుంటుంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. నాని తరువాత కథల విషయంలో అంతటి ప్రత్యేక శ్రద్ధ పెట్టే హీరోగా శర్వానంద్ కనిపిస్తాడు. తెరపై శర్వానంద్ నటన నిలకడగా .. నిబ్బరంగా ఉంటుంది. అనవసరమైన హడావిడి చేయడం .. అతి చేయడం ఆయనలో కనిపించదు. ఆయన నటన చాలా సహజంగా .. నీట్ గా ఉంటుంది. అందువల్లనే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

అలాంటి శర్వానంద్ ఎప్పటిలానే కొత్తదనం కలిగిన కథలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. కానీ కొంతకాలంగా ఆయనకి  కథలు కలిసిరావడం లేదు. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనుకున్న 'పడి పడి లేచే మనసు' .. 'జాను' రెండూ కూడా అంచనాలను తలక్రిందులు చేశాయి. దాంతో ఆయన 'శ్రీకారం' సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలో కథ నడవడం .. యూత్ కి సందేశం ఉండటం .. కావాల్సినంత వినోదం వండటం  .. పాటలకి మంచి రెస్పాన్స్ రావడం .. ఆయనలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. బిజినెస్ కూడా బాగా జరగడంతో ఆయన అంచనాలు పెరిగిపోయాయి.

లాక్ డౌన్ తరువాత థియేటర్స్ కి వచ్చిన చాలా సినిమాలు హిట్ బాట పట్టడం ఆయన నమ్మకం బలపడటానికి మరో కారణమైంది. దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ పట్టుకొచ్చి దోసిట్లో పెడుతుందని ఆయన అనుకున్నాడు. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయికి తూగలేకపోయింది. ఆశించిన స్థాయిలో వసూళ్ల టార్గెట్ ను చేరలేకపోయింది.  ఫలితంగా నిర్మాతలకు నష్టాలు వచ్చాయనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. కొత్తదనంతో ముందుకు వెళుతున్న తనకి ఎదురుదెబ్బలు తగులుతూ ఉండటంతో, నిబ్బరంగా ఉండే శర్వా కూడా డీలాపడిపోయాడనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారాలను నమ్మలేంగానీ, శర్వానంద్ తన తదుపరి సినిమా అయిన 'మహాసముద్రం' విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే టాక్ ను మాత్రం కొంతవరకూ నమ్మొచ్చు.       
Tags:    

Similar News