కోలీవుడ్ స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల 'లీడర్ 2'

Update: 2022-04-27 11:30 GMT
శేఖర్ కమ్ములకి యూత్ పల్స్ బాగా తెలుసు. అందుకే యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథలను ఆయన అద్భుతంగా  తెరకెక్కిస్తూ ఉంటారు. ఆయన ప్రేమకథల్లో కుటుంబ నేపథ్యాలు .. బలమైన బంధాలు .. ఎమోషన్స్ ఉంటాయి.

అందువల్లనే ఆయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది.  క్రితం ఏడాది ఆయన నుంచి వచ్చిన 'లవ్  స్టోరీ' కూడా యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచి మాత్రం ఆయన కాస్త రూట్ మారుస్తున్నట్టుగా అనిపిస్తోంది.

శేఖర్ కమ్ముల తనకి అచ్చొచ్చిన ప్రేమకథలను కాకుండా అందుకు భిన్నమైన కథల వైపు ఆయన అడుగులు వేస్తున్నారు. ధనుశ్ హీరోగా  ఆయన ఒక సినిమా చేస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు నుంచి వెళ్లి బయట హీరోతో ఆయన చేస్తున్న సినిమా ఇది. అలాగే తెలుగుతో పాటు తమిళంలోను ఆయన చేస్తున్న సినిమా ఇదే. ఈ ప్రాజెక్టు పైనే ఆయన  పూర్తి దృష్టి పెట్టారు.

ఇక ఈ సినిమా తరువాత కూడా ఆయన టాలీవుడ్ హీరోల వైపు చూడటం లేదని తెలుస్తోంది. ధనుశ్ సినిమా తరువాత తెలుగులో ఆయన ఏ హీరోతో చేయనున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఆయన ఆ తరువాత సినిమాను కూడా తమిళ హీరోతోనే చేయనున్నారని చెబుతున్నారు.

ఆ హీరో ఎవరో కాదు .. సూర్య. చాలా కాలంగా సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నారు. అందుకు తగిన కథ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా పలు వేదికలపై చెప్పారు కూడా. అలాంటి సూర్యకు శేఖర్ కమ్ముల ఒక కథను చెప్పడం .. ఆ కథ సూర్యకు బాగా నచ్చేయడం జరిగిపోయిందని అంటున్నారు.

ఈ సినిమా కూడా తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ కథకు 'లీడర్ 2' అనే టైటిల్ ను అనుకుంటున్నారట. అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గతంలో వచ్చిన 'లీడర్'కి ఇది సీక్వెల్ కాదని అంటున్నారు. 2010లో రానా హీరోగా శేఖర్ కమ్ముల 'లీడర్' సినిమాను రూపొందించారు. అయితే అది అంతగా ఆడలేదు. ఇప్పుడు మరో కథతో శేఖర్ కమ్ముల 'లీడర్' 2 చేయనున్నాడన్నమాట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Tags:    

Similar News