ఇన్నేళ్ళ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై శివ

Update: 2018-02-12 11:31 GMT
రామ్ గోపాల్ వర్మ శివ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూసలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమాకు కొత్త నడకలు నేర్పిన ఈ మూవీ అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఇప్పటికి కూడా ఒక రెఫరెన్సులాగా ఉంది అనేది నిజం. తాను సృష్టించిన ఈ అద్భుతాన్ని తిరిగి మళ్ళి పునః సృష్టి వర్మనే చేయలేకపోయాడు అంటే దీని గొప్పదనం ఏంటో అర్థమవుతుంది. అలాంటి ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ పాతిక సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా 2016లో పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా జరిగిన వేడుకలో శివని పూర్తిగా రీ మాస్టర్ చేసి కొత్తగా మిక్స్ చేసిన డిటిఎస్ డాల్బీ సౌండ్ తో రీ రిలీజ్ చేస్తామని వర్మ, నాగ్ సంయుక్తంగా ప్రకటించారు. కాని అది రెండేళ్ళు దాటినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే టీవీలో లెక్కలేనన్ని సార్లు ప్రసారం కావడం, యు ట్యూబ్ లో చక్కని క్వాలిటీతో అఫీషియల్ గానే అందుబాటులో ఉన్న కారణంగా ఇంత ఖర్చు పెట్టి థియేటర్లలో విడుదల చేస్తే ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనే అనుమానాలు వచ్చాయి. దాంతో అది ఆలోచన దశలోనే ఆగిపోయింది.

కాని నాగ్ ఫాన్స్ సంబరపడే వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఈ నెల 18న హైదరాబాద్ పివిఆర్ లో శివ సినిమా స్పెషల్ షోని బిగ్ స్క్రీన్ పై వేయబోతున్నారట. ఇది అన్నపూర్ణ సంస్థ ఏర్పాటు చేసిందా లేక వర్మ టీం సెటప్ చేసిందా అనే వివరాలు తెలియవు కాని స్క్రీనింగ్ కి మాత్రం శివకు పని చేసిన టీం మొత్తం రావోచ్చనే వార్త ఉంది. అదే నిజమైతే మరో సారి వెండితెరపై శివతాండవాన్ని కళ్ళారా చూసుకోవచ్చు. అభిమానులకు ఎంట్రీ ఉంటుందా లేదా అనే క్లారిటీ రావలసి ఉంది. అదేదో తెలుగు రాష్ట్రాలు మొత్తం మెయిన్ సెంటర్స్ లో అయినా విడుదల చేస్తే అందరికి చూసే భాగ్యం దక్కుతుంది కదా అని అడుగుతున్న వారు లేకపోలేదు.

కాని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇది వర్క్ అవుట్ అయితే కాదు. థియేటర్ అద్దెలు - అడ్వాన్సులు - పబ్లిసిటీ ఖర్చులు వగైరాలన్ని భరించి పాత సినిమాలు విడుదల చేసే పరిస్థితి టాలీవుడ్ లో లేదు. అందుకే రిస్క్ చేయకుండా ఇలా సింగల్ షో స్క్రీనింగ్ తో మేనేజ్ చేస్తున్నారు. కనీసం ఇలా ఒక్క షో అయినా ముఖ్య కేంద్రాల్లో వేస్తే మేము చూస్తాంగా అంటున్నారు నాగ్ ఫాన్స్. మరి ఆయన వింటారో లేదో.
Tags:    

Similar News