పునీత్ సినిమాకి శివరాజ్ కుమార్ డబ్బింగ్!

Update: 2022-02-03 07:49 GMT
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ స్టార్ హీరోగా కొనసాగారు. అక్కడి మాస్ ఆడియన్స్ లో ఆయనకి విపరీతమైన క్రేజ్ ఉండేది. రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి తిరుగులేని వారసత్వంతో వచ్చినప్పటికీ, హీరోగా స్టార్ డమ్ ను సంపాదించుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. దర్శక నిర్మాతలతో ఎంతో అభిమానంతో నడచుకునేవారు. అంతే ప్రేమతో అభిమానులతో వ్యవహరించేవారు. ఇక ఆయన ఎప్పుడూ తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లడం కాకుండా, ఇతర ఇండస్ట్రీల్లోని హీరోలందరితోను ఎంతో చనువుగా ఉండేవారు.

తన సినిమాల్లో ఇతర భాషల్లోని స్టార్స్ ను కూడా ఒక భాగం చేయడానికి ఆయన ఆసక్తిని చూపుతుండేవారు. ఆయన సినిమాల్లో గెస్టుగా కనిపించాలన్నా .. వాయిస్ ఓవర్ చెప్పాలన్నా .. పాట పాడాలన్నా కాదనే స్టార్ హీరోలు లేరు. అలాగే ఇక్కడి సినిమాలు కన్నడ ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లే విషయంలో కూడా ఆయన సపోర్టు అంతగానే ఉండేది. ఇక తన భాషలో తన తోటి హీరోలను ప్రోత్సహించే విషయంలోను ఆయన ముందుండటం విశేషం. ఆయన తాజా చిత్రమైన 'గంధన గుడి' ముగింపు దశలో ఉండగా ఆయన చనిపోయారు. ఇప్పుడు ఇది ఆయన చివరి సినిమాగా .. ఒక జ్ఞాపకంగా మారింది.

ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పునీత్ రాజ్ కుమార్ పాత్రకి ఆయన సోదరుడు శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. తన సోదరుడు చివరిసారిగా చేసిన పాత్రకి తాను డబ్బింగ్ చెబుతూ శివ రాజ్ కుమార్ చాలా ఎమోషన్ అయినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మార్చి 17వ తేదీన ఈ సినిమాను అక్కడ భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

పునీత్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అమోఘవర్ష దర్శకత్వం వహించాడు. అజనీశ్ లోక్ నాథ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మితమైందని చెప్పడంతో అందరిలో మరింతగా ఉత్కంఠ పెరుగుతోంది. అడవి నేపథ్యంలో నడిచే ఈ సినిమాకి ప్రతీక్ శెట్టి ఫొటోగ్రఫీ ప్రధాన బలంగా నిలవనుందని అంటున్నారు. ఇక ఇదే టైటిల్ తో 1973లో రాజ్ కుమార్ చేసిన సినిమా భారీ విజయాన్ని సాధించడం కూడా ఈ సినిమాకి కలిసిరానుంది.      
Tags:    

Similar News