ఒంటరితనానికి మించిన భయం లేదు!

Update: 2022-01-09 00:30 GMT
ఆది సాయికుమార్ కెరియర్ తొలినాళ్లలో మంచి హిట్లనే సొంతం చేసుకున్నాడు. ఒక హీరోగా మంచి మార్కులను దక్కించుకున్నాడు. డైలాగ్ డెలివరీ .. ఎమోషన్స్ .. డాన్స్ .. ఫైట్స్ .. ఇలా అన్ని విషయాల్లోను ప్రేక్షకుల నుంచి శభాష్ అనిపించుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఆయన తన సినిమాల మధ్య గ్యాప్ రాకుండా వరుస సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. అయితే సరైన హిట్ మాత్రం పడటం లేదు. అయినా నిరాశ పడకుండా ఎప్పటికప్పుడు తన ప్రయత్నం తను చేస్తూనే వస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'అతిథి దేవో భవ' ఈ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిర్యాల రాజబాబు - అశోక్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ జోడీగా నువేక్ష అలరిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆది సాయికుమార్ మాట్లాడుతూ .. 'అతిథి దేవోభవ' టైటిల్ కి తగినట్టుగానే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతి సందర్భంగా చూడదగిన సినిమా. ఈ సినిమాలో హీరో పేరు అభయ్ .. అతనికి ఒంటరితనం అంటే భయం. ఒంటరిగా ఉండాలన్నా .. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా భయపడుతూ ఉంటాడు.

అలాంటి ఒక భయంతో ఉన్న హీరో ఒక రోజంతా ఒంటరిగా ఉండవలసి వస్తుంది. అప్పుడు ఆ హీరో ఏం చేశాడు? తనలోని భయాన్ని ఎలా జయించాడు? అనే అంశంతో ఈ కథ రన్ అవుతూ ఉంటుంది. ఒక వైపున ఫన్ .. మరో వైపున లవ్ నడుస్తూ ఉంటాయి. ఈ సినిమాలో నాకు తల్లిగా రోహిణిగారు చేశారు .. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది. నిజానికి ఈ సినిమాను జనవరి 26వ తేదీన విడుదల చేయాలని అనుకున్నాము. కానీ 'ఆర్ ఆర్ ఆర్ ' సినిమా వాయిదా పడటంతో జనవరి 7వ తేదీన వస్తే బాగుంటుందనే నిర్ణయాన్ని నిర్మాతలు తీసుకున్నారు.

హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వలన ప్రమోషన్స్ కి పెద్దగా సమయం లేదు. అయినా మీడియా సహాయంతో చాలా తక్కువ సమయంలో ఈ సినిమాను జనంలోకి తీసుకుని వెళ్లడం జరిగింది. నేను ఇంతవరకూ చేసిన పాత్రలకి ఈ సినిమాలోని పాత్ర పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. హీరో తనలోని భయాన్ని హీరోయిన్ కి తెలియకుండా జాగ్రత్తపడే తీరు నాకు ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇక సప్తగిరి ట్రాక్ హిలేరియస్ గా నవ్విస్తుంది. హీరోయిన్ కి .. నాకు మధ్య జరిగే సీన్స్ డైలీ లైఫ్ లో జరిగేవిగానే ఉంటాయి .. ఎక్కడా కూడా ఫోర్స్ గా అనిపించవు. నువేక్ష చాలా బాగా చేసింది .. తను మంచి డాన్సర్. ఈ సినిమాతో తనకి మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News