శ్రుతి హాసన్.. అతడి గురించి ఓపెన్ అయింది

Update: 2017-12-31 14:30 GMT
మైకేల్ కోర్సలే.. ఈ మధ్య శ్రుతి హాసన్ తో కలిపి తరచుగా వినిపిస్తున్న పేరు. లండన్ కు చెందిన ఈ థియేటర్ ఆర్టిస్టుతో శ్రుతి పీకల్లోతు ప్రేమల్లో మునిగిపోయిందని.. అతడిని త్వరలోనే ఆమె పెళ్లాడబోతోందని గట్టి ప్రచారమే జరుగుతోంది. మైకేల్ ను చెన్నైకి తీసుకురావడంతో ఒక వేడుకలో అతను శ్రుతితో కలిసి సంప్రదాయ పంచెకట్టుతో కనిపించడం.. పక్కన కమల్ కూడా ఉండటం.. ఇవన్నీ చూశాక పెళ్లి గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ శ్రుతి మాత్రం పెళ్లి విషయాన్ని కన్ఫమ్ చేయట్లేదు. కనీసం మైకేల్ తో తాను ప్రేమలో ఉన్నట్లు కూడా చెప్పట్లేదు. అతను తనకు క్లోజ్ ఫ్రెండ్ అంటూ అందరూ చెప్పే రొటీన్ మాటే చెప్పింది శ్రుతి కూడా.

‘‘నా పేరుతో మరో పేరు జత కలిస్తే కచ్చితంగా నేనే చెబుతా. నాకైతే ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచనే లేదు. మరో రెండేళ్ల తర్వాత కూడా పెళ్లి గురించి ఆలోచిస్తానో లేదో తెలియదు. మీరు నా పేరును ముడిపెట్టి చెబుతున్న వ్యక్తి నాకు ప్రియమైన స్నేహితుడు. అతను నాకు చాలా ప్రత్యేకం. ఇంతకు మించి ఏమీ చెప్పను. నా పర్సనల్‌ లైఫ్‌ గురించి అన్నీ చెప్పేయాలంటే ఎలా కుదురుతుంది’’ అని శ్రుతి అంది. పెళ్లి కోసమే సినిమాలు ఒప్పుకోవట్లేదని జరుగుతున్న ప్రచారం గురించి శ్రుతి దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘అలాంటిదేమీ లేదు. నేను ఎనిమిదేళ్లుగా కథానాయికగా కొనసాగుతున్న. ఈ ఎనిమిదేళ్లలో నేను రిలాక్స్‌ అయిన రోజులు చాలా తక్కువ. జీవితం అంటే పనే అన్నట్లు అయిపోయింది. చేతిలో ఆరేడు సినిమాలతో బిజీగా ఉన్న రోజులున్నాయి. ఒకానొక దశలో పర్సనల్‌ లైఫ్.. ప్రొఫెషనల్‌ లైఫ్‌.. ఈ రెంటికీ తేడా తెలియని పరిస్థితి తలెత్తింది. నన్నింత బిజీగా ఉంచినందుకు దేవుడికి ధన్యవాదాలు. కానీ మరీ ఎక్కువ పని చేయడం ప్రమాదం అనిపించింది. అందుకే రిలాక్స్ అవుతున్నా. అంతే కాక  ‘శ్రీమంతుడు’ - ‘ప్రేమమ్‌’ లాంటి సినిమాలు చేశాక మళ్లీ అలాంటి సినిమాలు చేయాలనిపించింది. అలాంటి స్ట్రాంగ్‌ ఉమన్‌ రోల్స్‌ కోసం ఎదురు చూస్తున్నా. ఆర్టిస్టుగా నన్ను సంతృప్తి పరిచే పాత్రలే ఒప్పుకోవాలనుకుంటున్నా’’ అని శ్రుతి స్పష్టం చేసింది.
Tags:    

Similar News