శింబు సవాలు విసిరాడు

Update: 2017-12-06 14:36 GMT
‘అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్’ అనే సినిమాకు సంబంధించి కోలీవుడ్ స్టార్ హీరో శింబు వల్ల తనకు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని.. అతడి నుంచి తనకు పరిహారం అందించాలని మైకేల్ రాయప్పన్ అనే తమిళ నిర్మాత ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. శింబు మీద గతంలోనూ వేరే నిర్మాతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి అతడికి రెడ్ కార్డు ఇస్తుందని.. అతను కొన్నాళ్ల పాటు షూటింగులకు దూరం కాక తప్పదని కోలీవుడ్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్ మూవీ నుంచి శింబును తప్పించవచ్చని కూడా వార్తలొచ్చాయి.

ఐతే ఈ ఊహాగానాలపై శింబు స్పందించాడు. తాను మణిరత్నం సినిమాలో నటించి తీరుతానని అతను స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని.. తాను పాల్గొంటానని.. దమ్ముంటే తాను ఈ సినిమాలో పని చేయకుండా ఆపాలని అతను సవాలు విసిరాడు. దీంతో పాటు ఇంకో రెండు సినిమాలు కూడా కమిటయ్యానని.. మొత్తం ఈ మూడు సినిమాల్ని వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తానని అతను తేల్చి చెప్పాడు. తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర పన్నుతున్నారని.. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వివాదాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అతను స్పష్టం చేశాడు. మరి శింబు విషయంలో మణిరత్నం టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News