‘సింహా’ అవార్డులు వచ్చేస్తున్నాయ్

Update: 2016-11-07 10:36 GMT
ఒకప్పుడు తెలుగు సినిమాలకు నంది అవార్డులు ప్రతిష్టాత్మకంగా ఉండేవి. వాటిని అటు ప్రభుత్వం.. ఇటు సినీ పరిశ్రమ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి. కానీ ఐదేళ్లుగా వాటి ఊసే లేదు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగానే అప్పటి ప్రభుత్వం వాటిని పక్కనబెట్టేయగా.. ఇక విభజన తర్వాత అది ఎవరికీ పట్టని వ్యవహారం అయిపోయింది. ఐతే ఈ మధ్యే తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నంది అవార్డుల పేరు మార్చి.. కొత్త పేరుతో అవార్డులిచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ సూచన ప్రకారం ‘నంది’ అవార్డుల పేరును ‘సింహా’ అవార్డులుగా మారుస్తున్నారు.

త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ సింహా అవార్డుల గురించి ప్రకటన చేస్తారట. ఇకపై ప్రతి ఏటా అవార్డులు ప్రకటిస్తారట. ఈ సింహా అవార్డులతో పాటు తెలంగాణ సినీ దిగ్గజాల పేరుతోనూ కొన్ని అవార్డులు ప్రకటిస్తారట. కత్తి కాంతారావు.. ప్రభాకర్ రెడ్డి.. పైడి జయరాజ్.. దాశరతి కృష్ణమాచార్య లాంటి వాళ్ల పేరు మీద అవార్డులుంటాయట. దివంగత సంగీత దర్శకుడు చక్రి పేరు మీద కూడా ఓ అవార్డు ఉంటుందని సమాచారం. 2017 నుంచి ఈ అవార్డులు మొదలు కావచ్చని భావిస్తున్నారు. ఈ వార్షిక సంవత్సరంలో వచ్చే సినిమాలకు వచ్చే ఉగాది రోజున అవార్డులు అందజేసే అవకాశముంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News