మీటూ : ఇప్పటికి నోరు విప్పిన సింగర్‌

Update: 2019-02-19 12:11 GMT
మీటూ అంటూ ఎంతో మంది సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ కే మీటూ పరిమితం అయ్యిందని భావిస్తున్న సమయంలో చిన్మయి రూపంలో కోలీవుడ్‌ లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడింది. తమిళ లెజెండ్రీ రైటర్‌ వైరముత్తు పై ఆమె చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టించింది. వైరముత్తుపైనే కాకుండా ఇంకా పలువురిపై చిన్మయి ఆరోపణలు చేసింది. తన సన్నిహితులు ఎదుర్కొన్న లైంగిక వేదింపులను కూడా ఆమె మీడియా ముందుకు తీసుకు వచ్చింది.

తనకు ఆప్తురాలైన ఒక సింగర్‌ ను సింగర్‌ కార్తిక్‌ లైంగికంగా వేదించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. తన సన్నిహితురాలి పట్ల పలు సార్లు కార్తిక్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని చిన్మయి ఆరోపించింది. అప్పటి నుండి కూడా కార్తిక్‌ సోషల్‌ మీడియాతో పాటు అన్ని కార్యక్రమాలకు దూరం అయ్యాడు. కనిపించకుండా పోయిన కార్తిక్‌ మళ్లీ ఇన్నాళ్లకు కనిపించాడు. సోషల్‌ మీడియా ద్వారా ఎట్టకేలకు మీటూ ఆరోపణలపై కార్తిక్‌ స్పందించాడు.

ట్విట్టర్‌ లో కార్తిక్‌ తనపై వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల నేను గత కొన్ని నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నాపై కొందరు తప్పుడు ఆరోపణలు చేశారు, నాకు తెలిసినంత వరకు నేను ఎవరి పట్ల అనుచితంగా ప్రవర్తించలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేలా వ్యవహరించలేదు. ఒకవేళ ఎవరికైనా నా వల్ల ఇబ్బంది కలిగి ఉంటే నేరుగా నన్ను సంప్రదిస్తే నా తప్పు ఉంటే క్షమాపణ అడుగుతాను. నా తప్పు ఉంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు కూడా నేను సిద్దంగా ఉన్నాను. మా నాన్న గారి ఆరోగ్యం గత కొన్నాళ్లుగా బాగాలేదు. అందుకే సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాను. అంతే తప్ప మరే ఇతర కారణం లేదు.
Tags:    

Similar News