మధుప్రియ జోకులు పేలిపోతున్నాయ్

Update: 2017-07-26 11:30 GMT
తెలుగు ‘బిగ్ బాస్’ షోకు సంబంధించి నిన్నట్నుంచి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ హెడ్ లైన్స్ లో ఉన్నాడు. తెరమీద తనదైన బిల్డప్.. అతి విన్యాసాలతో నవ్వించే సంపూ.. ‘బిగ్ బాస్’ హౌస్ లో అంత బేలగా మారిపోవడం.. ఏడ్చేయడం.. నేనిక్కడ ఉండలేనంటూ బయటికి వచ్చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘బిగ్ బాస్’లో సంపూ కథ ముగిసిపోయింది కాబట్టి ఇక అతడి గురించి చర్చ ఆపేయొచ్చు. ఇక ఆ హౌజ్ లో అత్యంత చర్చనీయాంశమవుతోంది.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతున్నది సింగర్ మధుప్రియ గురించే. చిన్నతనంలోనే గాయనిగా మంచి పేరు తెచ్చుకుని.. మైనారిటీ తీరి తీరగానే పెళ్లి చేసుకుని.. చాలా ధైర్యవంతురాలిగా.. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిగా పేరు తెచ్చుకుంది మధుప్రియ.

కానీ ‘బిగ్ బాస్’ హౌజ్ లో మాత్రం ఈ అమ్మాయి బేలతనమంతా బయటపడుతోంది. హౌస్ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఒకటే ఏడుపులు. ఆమె ఏడవని రోజు లేదంటే అతిశయోక్తి లేదు. కన్నీళ్ల విలువేంటో చెబుతూ.. ఎన్టీఆర్ హెచ్చరించినా కూడా ఈ అమ్మాయి మారలేదు. ఏడుపు కొనసాగిస్తూనే ఉంది. మరీ ఆ రేంజిలో ఏడిస్తే సోషల్ మీడియాలో జనాలు ఊరుకుంటారా? ఈ అమ్మాయి మీద జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. ‘బిగ్ బాస్’ హౌస్ కు కావాల్సిన వాటర్ మొత్తం ఈ అమ్మాయే సప్లై చేస్తోందని ఒకరు.. ఫేస్ బుక్ యజమాని జుకర్ బర్గ్ ఏడుపును సూచించే ఇమోజీని తీసేసి మధుప్రియ ముఖం పెట్టాడని ఇంకొకరు.. ఇలా రకరకాలుగా మధుప్రియను ట్రోల్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ జోకులు ఫార్వర్డ్ అవుతున్నాయి. షో ముందుకు సాగే కొద్దీ అయినా ఈ అమ్మాయిలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News