పాట రాసేవాళ్ల‌కు శాస్త్రి గారి టిప్స్‌

Update: 2019-02-01 04:53 GMT
ఓ క‌వి నువ్వు చెప్ప‌ద‌లిచిన భావాన్ని చెప్పి.. దానికి అర్థం తీసుకురా! అన్న‌దే పాట ర‌హ‌స్యం అని గుట్టు విప్పారు... శాస్త్రి గారు. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ద‌క్కిన సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో త‌న‌పై సంధించిన ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌కు సీనియ‌ర్ లిరిసిస్ట్, అవార్డు గ్ర‌హీత‌ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి త‌న‌దైన శైలిలో జ‌వాబులిచ్చారు. ఈ సంద‌ర్భంగా న‌వ‌త‌రం లిరిసిస్టుల‌కు ఉప‌యుక్త‌మ‌య్యే ఎన్నో టిప్స్ ని శాస్త్రి గారు య‌థాలాపంగానే అందించేశారు.

పాట రాయాలి అన్న త‌ప‌న ఉన్న వాళ్ల‌కు ఆయ‌న ప‌లుకులు ఓ అద్భుత‌మైన క్లాస్ అని అన‌డంలో సందేహం లేదు. పాట గుట్టుపై ఆయ‌న మాట్లాడుతూ.. ఇటీవ‌ల పాట‌కు అల‌రించ‌డ‌మే కాదు.. `అల్ల‌రించ‌డం` ఎక్కువైంది.. అని ఛ‌మ‌త్క‌రించారు. అంటే యువ ర‌చ‌యిత‌లు స‌రిచేసుకోవాల్సిన సంద‌ర్భం ఉంద‌ని త‌న‌దైన శైలిలో చురుక్కుమ‌నిపించారు. ట్యూన్ ఓకే చేసేశాం అంటారు.. కానీ అది ఓకే చేయాల్సింది మీరు కాదండీ.. రాసేవాళ్లు అని అన్నారు శాస్త్రి గారు. అది ఏ ర‌సానికి త‌గ్గ‌ట్టు ఉందో చూసుకుని రాయాల్సింది నేను. అంతేకాదు క‌థా చ‌ర్చ‌ల్లోనూ న‌న్ను కూచోబెట్టండి అని అడుగుతాను.. అని తెలిపారు. కేవ‌లం పాట‌ను అతికించేయ‌డానికి ట్యూన్ ఇచ్చి రాసేయ‌మంటే స‌రిపోతుంది. పాట ఇంకా నిల‌బ‌డాలంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో స‌హ‌ప్ర‌యాణం చాలా ఇంపార్టెంట్... అని త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించారు.

ఆధునిక చ‌దువులు ఎంత బ‌ర్డెన్ అయ్యాయో చెబుతూ `బోడి చ‌దువులు వేస్టు` అంటూ రాశాన‌ని, నేటి విద్యార్థులు జీవితాంతం చ‌దువుతూ అవి ఎందుకు ఉప‌యోగ‌ప‌డుతున్నాయో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉండ‌డం వ‌ల్ల‌నే తాను అలా రాయాల్సొచ్చింద‌ని అన్నారు. జోల పాట నిదుర పుచ్చేందుకు.. జ్వాల పాట మేల్కొలిపేందుకు.. ఎప్పుడు జోల పాట పాడాలో.. ఎప్పుడు జ్వాల పాట పాడాలో.. స‌న్నివేశానికి రాసేవాడికి ముఖ్యం. త‌ను చేసిన దుర్మార్గాల‌ను తెలుసుకుని భార్యా బిడ్డ‌ల‌కు లాలి జో లాలిజో.. ఊరుకో పాపాయి... అంటూ రాశాను. త‌న‌లో ఉన్న రాక్ష‌సుడిని ప‌డుకోబెట్టుకుంటూ .. త‌న‌లోని మ‌నిషిని మేల్కొలుపుతూ.. మేయ‌ర్ .. క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌వృత్తిపై పాట రాశాను.

ఎంత మోటైన శృంగారం అయినా రాస్తాను. కానీ స్త్రీని కించ‌ప‌రిచేలా రాయ‌ను. కుర్ర‌కారును రెచ్చ‌గొట్టే పాట‌ను రాయ‌ను. ప‌బ్బు క్ల‌బ్బు పాట‌లు చెడ‌గొట్టేవి రాయ‌లేనని ... ట్యూన్ కి రాయ‌డం అన్న‌ది  ఇప్ప‌టిది కాదు.. మొట్ట మొద‌టి నుంచి ఉంది. తెలుగు గ్రామ‌ర్ లో చంద‌స్సులు ఎన్నో ఉన్నాయి. అప్ప‌టి నుంచే ఇది ఉంది.. అని అన్నారు. త‌న‌కు రాత్రి పూట‌ రాయ‌డం సౌక‌ర్యం గా ఉంటుంద‌ని, ప‌గ‌టి శ‌బ్ధాల వ‌ల్ల డిస్ట్ర‌బెన్స్ మూడ్ చెడ‌గొడుతుంద‌ని సిరివెన్నెల అన్నారు. ఆయ‌న ప‌లుకుల నుంచి నేర్చుకునేవారికి నేర్చుకున్నంత‌. ఔత్సాహిక లిరిసిస్టుల‌కు ఉప‌యుక్త‌మ‌య్యే ఎన్నో ర‌హ‌స్యాల్ని శాస్త్రి గారు ఈ సంద‌ర్భంగా మీడియా మిత్రుల‌తో ముచ్చ‌ట్ల‌లో రివీల్ చేశారు.
Tags:    

Similar News