ఓటీటీలో యుద్ధంతో రాసిన ప్రేమకథ పరిస్థితేంటి..?

Update: 2022-09-13 12:07 GMT
దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా.. రష్మిక మందన్నా - సుమంత్ - తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ''సీతా రామం''. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముందుగా తెలుగు తమిళ మలయాళ భాషల్లో మంచి వసూళ్లను రాబట్టిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా.. హిందీలో కాస్త ఆలస్యంగా రిలీజ్ అయింది. అక్కడా అనూహ్య స్పందన తెచ్చుకుంది.

డిజిటల్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన 'సీతారామం' సినిమా.. ఏడు వారాల థియేట్రికల్ రన్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా హోమ్ స్క్రీన్స్ మీదకు వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ కు కళ తీసుకొచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు గత కొంత కాలంగా పెద్ద హిట్టు లేక డల్ గా ఉన్న ఓటీటీకి జోష్ తెచ్చిపెట్టిందని తెలుస్తోంది.

సెప్టెంబర్ 9 అర్ధరాత్రి నుంచి ప్రైమ్ వీడియోలో 'సీతా రామం' స్ట్రీమింగ్ ప్రారంభం అవ్వగా.. కొన్ని గంటల్లోనే ఇండియా వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి  కోట్లలో వ్యూస్ హోరెత్తిపోతున్నాయని డిజిటల్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా హాళ్లలో మిస్ అయిన జనాలతో పాటుగా థియేటర్లో చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఓటీటీలలో ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారని తెలుస్తోంది.

మంచి కంటెంట్ తో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇప్పటికే థియేటర్ రిలీజ్ ద్వారా 'సీతా రామం' ప్రూవ్ చేసింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఓటీటీలోనూ విశేష ఆదరణ లభిస్తోంది. ఇలాంటి సినిమాను థియేటర్ లో ఎలా మిస్ అయ్యాం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

హిందీ వెర్షన్ రిలీజైన కేవలం వారానికే మిగతా భాషల్లో డిజిటల్ రిలీజ్ చేసేయడం కూడా ప్రైమ్ కు చాలా ప్లస్ అవుతోందని అర్థమవుతోంది. విదేశాల్లోనూ సబ్ టైటిల్స్ తో 'సీతా రామం' సినిమాను అత్యధికలు చూసి ఎంజాయ్ చేస్తున్నారని సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. ట్రెండ్‌ చూస్తుంటే రాబోయే రోజుల్లో డిజిటల్ స్పేస్ లోనూ ఈ సినిమా రికార్డులు నెలకొలిపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రామ్ - సీతా మహాలక్ష్మి మధ్య అందమైన ప్రేమకథకు యుద్ధ నేపథ్యం జోడించి తనదైన స్క్రీన్‌ ప్లే‌తో 'సీతా రామం' సినిమాని తెరపై ఆవిష్కరించారు దర్శకుడు హను. సీతా మహాలక్ష్మి లేదా ప్రిన్సెస్ నూర్జహాన్ గా మృణాల్.. లెఫ్టినెంట్ రామ్ గా దుల్కర్ అద్భుతమైన నటన కనబరిచారు. మిగతా ప్రధాన పాత్రలు కూడా మెప్పించారు. ఇప్పుడు ఓటీటీలో ప్రతీది ఆస్వాదిస్తున్న ప్రేక్షకులు.. ఈ సినిమాలో తమకు నచ్చిన సీన్ లేదా సాంగ్ క్లిప్పింగ్స్ ను షేర్ చేస్తున్నారు.

ప్రధాన జోడీ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని.. ఇంటర్వెల్ సీన్ - క్లైమాక్స్ తో పాటుగా చాలా సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేశాయని అంటున్నారు. అద్భుతమైన సంభాషణలు రాసిన హను - జై కృష్ణ - రాజ్ కుమార్ లను మెచ్చుకుంటున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం మరియు పీఎస్ వినోద్ - శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని ప్రశంసిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో 'సీతా రామం' వంటి మధుర కావ్యాన్ని నిర్మించారని అశ్వనీ దత్ ని కొనియాడుతున్నారు.

అదే సమయంలో 'సీతా రామం'లో లెఫ్టినెంట్ రామ్ - ప్రిన్సెస్ నూర్జహాన్ మధ్య లవ్ స్టోరీని.. 'మల్లేశ్వరి' సినిమాలో వెంకటేష్ - కత్రినా కైఫ్ ల ప్రేమ కథతో పోలుస్తూ కొందరు నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 'మనం' చిత్రంలో నాగార్జున - శ్రీయా సీన్స్ ని ఇక్కడ దుల్కర్ - మృణాల్ సన్నివేశాలకు పోలికలు ఉన్నాయని వీడియోలు షేర్ చేస్తున్నారు. ఓటీటీలో కంటే బిగ్ స్క్రీన్ మీదనే మంచి ఫీలింగ్ ను కలిగించిందని కామెంట్స్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News