20 రోజుల తర్వాత కూడా బుకింగ్ లో ఆ కలరేంది భయ్యా?

Update: 2022-08-28 04:26 GMT
చాలా అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి రోజు చూస్తున్నట్లుగా చెప్పక తప్పదు. ఒక మోస్తరు అంచనాలతో మూవీ రిలీజ్ కావటం.. అనూహ్యంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటం చాలా సినిమాల్లో చూస్తుంటాం. నిజానికి ఇలాంటివి అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకు భిన్నంగా భారీ సక్సెస్ మాత్రమే కాదు.. టాలీవుడ్ చరిత్రలో అందమైన ప్రేమకధల జాబితాలో టాప్ 5 ప్లేస్ లో మూవీ ఉంటుందన్న మాటే.. సీతారామం ప్రత్యేకతగా చెప్పాలి. ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు పడుతున్న బ్రహ్మరథం అంతా ఇంతా కాదని చెప్పాలి.

పెద్ద హీరోల సినిమాలు సైతం మొదటి వారం మాత్రమే తప్పించి.. రెండో వారం మీద పెద్దగా ఆశలు పెట్టుకోకపోవటం ఇప్పుడు కొత్త ట్రెండ్ అన్న విషయం తెలిసిందే. అలాంటిది సీతారామం మూవీ విడుదలై మూడు వారాలు దాటేసిన తర్వాత కూడా అడ్వాన్స్ బుకింగ్ ల విషయంలో 'మెరూన్' కలర్ దర్శనమివ్వటం చాలా అరుదైన విషయంగా చెప్పాలి. ఇటీవల కాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకు సైతం సాధ్యం కాని ఈ ఫీట్.. సీతారామం విషయంలో ఎలా సాధ్యమైందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సీతారామం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావటం.. మౌత్ టాక్ తో ప్రేక్షకులు తమకు తామే థియేటర్ కు తరలిరావటం.. సినిమా పూర్తి అయ్యాక.. సీట్లో అలానే రెండు.. మూడు నిమిషాలు ఉండిపోవడం లాంటి చూస్తున్నదే. అంతలా కనెక్టు చేసిన ఈ మూవీ ఇప్పుడు మూడో వారం నడుస్తోంది. అయినప్పటికీ.. ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకోవటం.. ఫాస్ట్ ఫిల్లింగ్ మూవీగా ఉండటం సీతారామం ప్రత్యేకతగా చెప్పాలి.

మూవీ రిలీజ్ వ్యవహారంలో  పరిమిత సంఖ్యలో ధియేటర్లలో విడుదల కావటం కూడా సినిమాకు లాభించిందనే చెబుతున్నారు. పాజిటివ్ ఫలితాలు రావటంతో పాటు..ఈ మూవీని వెండితెర మీద చూస్తే ఆ కిక్కే వేరన్న ప్రచారం కూడా సినిమాకు ప్రయోజనం కలిగించేలా చేసిందని చెప్పక తప్పదు. మూడో వారంలోకి అడుగు పెట్టే నాటికి.. సీతారామం మూవీ గ్రాస్ కలెక్షన్లు రూ.75 కోట్లు దాటేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించటం తెలిసిందే.

ఇప్పటికి పలు థియేటర్లలో సీతారామం టికెట్లకు డిమాండ్ నెలకొని ఉండటం.. మరో వారం.. రెండు వారాలు సాగినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ లోపు హిందీలో రిలీజ్ అయి..బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్టు అయితే.. ఈ మూవీ కలెక్షన్ల సునామీ ఖాయమంటున్నారు. హిందీలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఈ మూవీ ఫలితం ఎలా ఉన్నా.. తెలుగు వరకు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల  క్లబ్ లో చేరటం ఖాయమంటున్నారు. హిందీలో కనెక్టు అయితే.. అదిరే కలెక్షన్ ఫిగర్లు ఫైనల్ కావటం ఖాయమని.. బిజినెస్ క్లోజ్ అయ్యే నాటికి సర్ ప్రైజింగ్ కలెక్షన్ల గురించి చెప్పే అవకాశమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. సీతరామం ప్రేక్షకులతో పాటు బాక్సాఫీస్ ను ఆడ్మైర్ చేసేసిందని చెప్పాలి. 
Tags:    

Similar News