నిర్మాత చేసిన ప‌నికి కోర్టుమెట్లెక్కిన శివ‌కార్తికేయ‌న్‌

Update: 2022-03-29 16:30 GMT
ఓ నిర్మాత చేసిన ప‌నికి కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయ‌న్ తాజాగా కోర్టు మెట్లెక్కారు.  త‌న‌కు ఇస్తానన్న మొత్తంలో కొంత ఇవ్వ‌కుండా మూడేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నార‌ని మ‌ద్రాసు హై కోర్టులో నిర్మాత‌పై కేసు వేశారు. ఇప్పుడిది త‌మిళ నాట సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే...వివ కార్తికేయ‌న్ హీరోగా నిర్మాత కె.ఇ. జ్ఞాన‌వేళ్ రాజా  2019 లో `మిస్ట‌ర్ లోక‌ల్‌` అనే పేరుతో ఓ సినిమాని నిర్మించారు. సినిమా విడుద‌లైంది. మంచి విజ‌యాన్ని సాధించింది.

అయితే ఇందులో న‌టించ‌డానికి హీరో కార్తికేయ‌కు  నిర్మాత ముందు 15 కోట్లు ఇస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే అందులో కొంత మొత్తం చెల్లించి మిగ‌తా మొత్తం ఇవ్వ‌లేద‌ట‌. దాదాపు మూడేళ్లుగా ఈ విష‌యంపై నిర్మాత కె.ఇ. జ్ఞాన‌వేళ్ రాజా ని సంప్ర‌దిస్తున్నా అత‌ని నుంచి ఎలాంటి స‌మాధానం లేక‌పోవ‌డంతో హీరో శివ కార్తికేయ‌న్ త‌న పారితోషికం ఇప్పించాలంటూ తాజాగా మ‌ద్రాసు హైకోర్టుని ఆశ్ర‌యించ‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తన పారితోషికం కింది 15 కోట్ల‌కు గానూ ముందు 11 కోట్ల మాత్ర‌మే చెల్లించిన కె.ఇ. జ్ఞాన‌వేళ్ రాజా మిగ‌తా 4 కోట్ల‌ని చెల్లించ‌డం లేద‌ని, అడిగితే స‌మాధానం లేక‌పోగా ఇచ్చిన 11 కోట్ల‌కు టీడీఎస్ కూడా నిర్మాత చెల్లించ‌లేద‌ని, ఇందు కోసం తానే 91 ల‌క్ష‌లు టీడీఎస్ క‌ట్టాన‌ని కె.ఇ. జ్ఞాన‌వేళ్ రాజా పై హీరో శివ కార్తికేయ‌న్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు రావాల్సిన రెమ్యున‌రేష‌న్ చెల్లించేంత వ‌ర‌కు `మిస్ట‌ర్ లోక‌ల్‌` చిత్రానికి సంబంధించిన ఎలాంటి హ‌క్కుల్ని ఎవ‌రికీ ఇవ్డానికి వీలు లేకుండా చూడాల‌ని హీరో శివ కార్తికేయ‌న్ త‌న పిటీష‌న్ లో పేర్కొన్నారు.

అంతే కాకుండా రెబ‌ల్‌, చియాన్ 61, పాతు తాలా వంటి చిత్రాల‌తో కె.ఇ. జ్ఞాన‌వేళ్ రాజా పెట్టుబ‌డులు పెట్ట‌కుండా నిషేధించాల‌ని గురువారం కె.ఇ. జ్ఞాన‌వేళ్ రాజాపై మ‌ద్రాసు హైకోర్టులో హీరో శివ కార్తికేయ‌న్ కేసు వేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శివ కార్తికేయ‌న్ ప్ర‌స్తుతం డాన్‌, అయాలన్ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇదే ఏడాది `జాతిర‌త్నాలు` ఫేమ్ అనుదీప్ కె.వి డైరెక్ష‌న్ లో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఓ బైలింగ్వ‌ల్ మూవీని చేస్తున్నారు.
Tags:    

Similar News