‘సన్ ఆఫ్ ఇండియా’.. ఇంకో రౌండ్

Update: 2022-05-19 23:30 GMT
కొన్నిసార్లు హిట్ సినిమాల కంటే ఫ్లాప్‌లు, డిజాస్టర్ల డిజిటల్ ప్రిమియర్స్ కోసమే ఎక్కువగా ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు. థియేటర్లలో మరీ దారుణంగా ఆడి, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైన చిత్రాలు.. ఓటీటీల్లోకి ఎప్పుడొస్తాయా అని చూస్తుంటారు. అసలెందుకీ సినిమా ఇంత డిజాస్టర్ అయింది.. ఎందుకు ఆ చిత్రం మీద అంతగా ట్రోలింగ్ జరిగింది అని తెలుసుకోవాలన్న ఆసక్తే అందుక్కారణం.

ఓటీటీల్లో చూసి మళ్లీ ట్రోల్ చేయడానికి కూడా కొందరు రెడీగా ఉంటారు. అలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమానే.. సన్ ఆఫ్ ఇండియా. లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు ప్రధాన పాత్రలో డైమండ్ రత్నబాబు రూపొందించిన ఈ చిత్రాన్ని మంచు వారి సొంత బేనర్లు ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’, ‘24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంయుక్తంగా నిర్మించాయి. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక చాలా కాలానికి, ఫిబ్రవరి 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఐతే ఈ సినిమాకు ఏమాత్రం బజ్ లేకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో కూడా జరగలేదు. థియేటర్‌కు రెండు మూడు టికెట్లు తెగడం, చాలా థియేటర్లలో ఒక్క టికెట్ కూడా అమ్మువకపోవడంపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియా.

సినిమాకు క్రేజ్ లేకపోయినా.. ఈ ట్రోలింగ్ కారణంగా నాలుగైదు రోజుల పాటు సన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. ఒక దశలో ట్రోలింగ్ శ్రుతి మించడంతో మంచు ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.

రిలీజ్ తర్వాత ఈ సినిమాకు చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. మోహన్ బాబు కెరీర్లో అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా దీనికి పేరొచ్చింది. వీకెండ్లో కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చూశారు.

ఐతే డీల్ కుదరలేదా.. ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది తెలియదు కానీ.. రిలీజైన మూడు నెలలకు, ఆలస్యంగా అమేజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ అప్‌డేట్ తెలుసుకుని ట్రోలర్స్ మళ్లీ రంగంలోకి దిగారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ చూసి ఇంకో రౌండ్ ఆ సినిమాను ఆటాడుకుంటున్నారు.
Tags:    

Similar News