కరోనా నేపథ్యంలో ఎయిర్‌ పోర్టు అధికారులను ప్రశంసించిన సోనమ్

Update: 2020-03-18 13:02 GMT
సామాజిక అంశాలపై అవసరమైనప్పుడల్లా స్పందించే సోనమ్ కపూర్ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో మరోసారి ముందుకొచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంతో గొప్పగా ఉన్నాయని బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనం కపూర్‌ ప్రశంసలు కురిపించారు. భారత ఎయిర్‌ పోర్టు అధికారులు కరోనాను అరికట్టేందుకు నిబద్ధతో పనిచేస్తున్నారని - అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే సోనం కపూర్‌ తన భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి లండన్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణం ముగించుకుని స్వదేశంలో అడుగుపెట్టిన సోనం దంపతులకు ఢిల్లీ ఎయిర్‌ పోర్టు అధికారులు స్క్రీనింగ్‌ నిర్వహించడంతో పాటు - గత 25 రోజులుగా వారు చేస్తున్న ప్రయాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ నేపథ్యంలో తన అనుభవాలను సోనం సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ ‘‘మేం లండన్‌ నుంచి బయల్దేరుతున్నప్పుడు స్క్రీనింగ్‌ చేయలేదు. ఈ విషయం తెలిసి షాకయ్యాం. అయితే భారత్‌కు చేరుకోగానే మా ప్రయాణాలకు సంబంధించిన వివరాలను ఎయిర్‌ పోర్టు అధికారులు ఫారమ్‌ లో నింపమన్నారు. అయితే అంతటితో ఆగిపోకుండా మరోసారి మా పాసుపోర్టులు పరిశీలించి మేం చెప్పింది నిజమా కాదా అని చెక్‌ చేశారు. అక్కడ ప్రతీ ఒక్కరూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు.

అదే విధంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని, స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం ద్వారా దీని వ్యాప్తిని నివారించవచ్చన్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలు - సినిమా హాళ్లు - మాల్స్‌ - జిమ్‌ సెంటర్లు - పార్కులు తదితర జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలను మూసివేసిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News