సోనూసూద్ ఫాలోవ‌ర్స్ 12 మిలియన్లు!

Update: 2021-06-28 07:38 GMT
దేశంలో తొలిద‌శ‌ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించే స‌మ‌యానికి సోనూసూద్ అంద‌రు సినీ న‌టుల్లో ఒక‌రు. కానీ.. ఇప్పుడు దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌ రియ‌ల్ హీరో. నేష‌న‌ల్ ఐకాన్. త‌న సేవా దృక్ప‌థంతో ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిజ‌మైన హీరోగా స్థానం సంపాదించారు.

మొద‌టి వేవ్ లో ఎంతో మంది అభాగ్యులకు ఆప‌న్న హ‌స్తం అందించిన‌ సోనూ సూద్.. ఆ త‌ర్వాత నుంచి చేతికి ఎముక లేద‌న్న చందంగా అడిగిన వారిక‌ల్లా స‌హాయం చేస్తూనే ఉన్నారు. సెకండ్ తార‌స్థాయికి చేరి, మార‌ణ‌హోమం సృష్టిస్తున్న వేళ కూడా తాను ఉన్నానంటూ అండ‌గా నిలిచారు.

సుమారు నాలుగు వంద‌ల మందితో దేశ‌వ్యాప్తంగా నెట్వ‌ర్క్ ఏర్పాటు చేసుకొని, ఎక్క‌డి నుంచి స‌హాయం కావాల‌ని పిలుపు అందినా.. వెంట‌నే వాలిపోయాడు. ఆసుప‌త్రుల్లో బెడ్లు, ఆక్సీజ‌న్‌, మందులు ఒక్క‌టేమిటీ.. ఎలాంటి స‌హాయం అడిగినా.. కాద‌న‌కుండా, లేద‌న‌కుండా త‌న వంతుగా స‌హ‌కారం అందిస్తూనే ఉన్నాడు.

కేవ‌లం సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి స‌హాయం అర్థించిన వారికి సైతం అండ‌గా నిలిచారు సోనూ. ఇప్ప‌టికీ ఈ స‌హ‌కారం అలా కొన‌సాగుతూనే ఉంది. దీంతో.. సోష‌ల్ మీడియాలో సోనూ ఫాలోవ‌ర్ల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఏ బ‌డా హీరోల‌కు లేనంత మంది ఫాలోవ‌ర్లు సోనూకు ఉన్నారు.

ఇన్ స్టా గ్రామ్ లో ఆయ‌నను అనుస‌రిస్తున్న వారి సంఖ్య అక్ష‌రాలా 12 మిలియ‌న్లు. ఈ ఘ‌న‌త సాధించిన అతి త‌క్కువ మందిలో సోనూ ఒక‌డు. ఆయ‌న సేవ‌కు ఫిదా అయిపోయిన నెటిజ‌న్లు.. సోనూ సైన్యంలో చేరిపోతున్నారు.
Tags:    

Similar News