ఐటీ దాడులపై సోనూసూద్ స్పందన..!

Update: 2021-09-20 08:54 GMT
బాలీవుడ్ నటుడు సోనూసూద్ నివాసం మరియు కార్యాలయాలపై గత నాలుగు రోజులపాటు ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐటీ దాడుల పై సోనూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విషయమేదైనా సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ జవాబు చెబుతుందని తెలిపారు. ''ఏ విషయంలోనైనా నువ్వు ప్రతిసారీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా శక్తి మేర సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సహాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది''

''నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను ఇచ్చే ఎండార్స్‌మెంట్ ఫీజును మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా సంస్థలకు సూచించాను. ఇది అలానే కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటం చేత మీకు అందుబాటులో లేను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను. ఈ ప్రయాణం కొనసాగుతుంది. జై హింద్'' అని సోనూ సూద్ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, పన్ను ఎగవేత ఆరోపణలతో ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది.

సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేశారని.. అతని ఫౌండేషన్‌ కు 18 కోట్లు విరాళాలు రాగా, అందులో కేవలం రూ.1.9 కోట్లు మాత్రమే సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారని ఐటీ శాఖ వెల్లడించింది. కరోనా సమయంలో ఎన్నో మంచి పనులు చేసి నేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ పై ఐటీ రైడ్స్ జరగడం.. 20కోట్లకు పైగా పన్ను ఎగవేశారని ఆరోపణలు రావడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు - పన్ను ఎగవేత గురించి ప్రస్తావించకుండా సోనూసూద్ సోమవారం ప్రకటన రిలీజ్ చేయడం గమనార్హం.


Tags:    

Similar News