నేను సాయం ఇలా చేశానుః హైకోర్టుకు సోనూ

Update: 2021-07-01 16:30 GMT
క‌రోనా మొద‌ట‌, రెండో ద‌శ‌ల్లో సోనూ సూద్ చేసిన స‌హాయం ఎలాంటిది అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా అంద‌రూ ఆయ‌న సేవ‌ల‌ను పొగిడారు. కొంద‌రు దేవున్ని కూడా చేశారు. అయితే.. చాలా మందిలో ఓ సందేహం కూడా ఉంది. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లే చేతులు ఎత్తేస్తున్న చోట‌.. అధికారులే ముఖం చాటేస్తున్న వేళ‌.. సోనూ మాత్రం ఇంత సేవ ఎలా చేయ‌గ‌లుగుతున్నాడు? ఎలా సాధ్య‌మ‌వుతోంది? అనే డౌట్ రైజ్‌ చేశారు.

చాలా మంది ఈ సందేహం వ్య‌క్తం చేసి ఊరుకుంటే.. కొంద‌రు మాత్రం కోర్టును ఆశ్ర‌యించారు. సామాజిక కార్య‌క‌ర్త నిలేష్ న‌వ‌ల‌ఖా, న్యాయ‌వాది స్నేహ‌మ‌ర్జాది ఈ మేర‌కు బాంబే హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లు చేశారు. సోనూ త‌ర‌హాలోనే సేవ‌లు అందిస్తున్న మ‌హారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీష‌న్ సిద్ధికీ పేరును కూడా చేర్చారు. ఈ పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన న్యాయ‌స్థానం.. గ‌తంలోనే వారిని ప్ర‌శ్నించింది. బ‌ల్క్ గా మందులు కొనుగోలు చేస్తున్నార‌ని, లైసెన్స్ లేకుండా ఇదెలా సాధ్య‌మ‌వుతోందో చెప్పాల‌ని ఆదేశించింది.

దీనిపై స్పందించిన సోనూ.. వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ మేర‌కు కోర్టుకు అఫిడ‌విట్ ను స‌మ‌ర్పించారు. తాను, త‌న టీం ఎక్క‌డా త‌ప్పు చేయ‌లేద‌ని తెలిపారు.. మందుల కొనుగోలు, వాటిని నిల్వ చేయ‌డం నుంచి.. బాధితుల‌కు అందించ‌డం వ‌ర‌కూ ఎక్క‌డా నిబంధ‌న‌లకు విరుద్ధంగా వెళ్ల‌లేద‌ని పేర్కొన్నారు.. త‌మ ఫౌండేష‌న్ త‌ర‌పున ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్, వ‌ల‌స కార్మికులకు భోజ‌నం స్వ‌యంగా అందించామ‌ని తెలిపారు.

ఇక‌, మందుల విష‌యానికి వ‌స్తే.. రాష్ట్రాల ప్ర‌భుత్వాలు, అధికారికి విభాగ‌ల‌తోనే క‌లిసి ప‌నిచేసిన‌ట్టు తెలిపారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను అధికార యంత్రాంగాల దృష్టికి తీసుకెళ్లి, సాయం అందేలా చూసిన‌ట్టు పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో.. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలిపారు. పేషెంట్ల ఆధార్ మొద‌లు, డాక్ట‌ర్ ప్రిస్కిప్ష‌న్ వ‌ర‌కు అన్నీ స‌రి చూసుకున్న త‌ర్వాతే స‌హాయం అందించేందుకు ముందుకు వెళ్లిన‌ట్టు తెలిపారు. సోనూ అఫిడ‌విట్ ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం.. కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను వాయిదా వేసింది.
Tags:    

Similar News