స్టార్ల‌నే కాదు వారిని మ‌లిచిన వారిని మ‌రువొద్దు!

Update: 2022-11-14 02:30 GMT
గ‌త కొంత‌కాలంగా సౌత్ సినిమాకు మ‌న స్టార్లకు ఉత్త‌రాదిన ఇమేజ్ అమాంతం పెరుగుతోంది. ఉత్త‌రాదిన‌ కొన్ని వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సౌత్ స్టార్లు ఎందులోను తీసిపోర‌ని నిరూపించారు. ముఖ్యంగా రూ.1000 కోట్ల క్ల‌బ్ స్టార్లుగా సౌత్ స్టార్లు ఉత్త‌రాది హీరోల‌కు పెను స‌వాల్ ని విసిరారు. దీని ప‌ర్య‌వ‌సానం ఇప్పుడు మ‌న హీరోల‌తో ఇంట‌ర్వ్యూల కోసం లేదా అవార్డు వేడుక‌ల్లో వీళ్ల సంద‌డి కోసం జాతీయ మీడియా సంస్థ‌లు - అవార్డుల పంపిణీ వేడుక‌ల పేరుతో వెంప‌ర్లాడుతున్నాయి.

త‌మ షోలను అద్భుత టీఆర్పీల‌తో రంజింపజేసేందుకు ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ల అవ‌స‌రాన్ని ఇవి గుర్తించాయి. దాదాపు వందేళ్ల భార‌తీయ సినీప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ‌లో 90ఏళ్ల టాలీవుడ్ ప్ర‌స్థానంలో ఇలాంటివి జ‌ర‌గ‌డం చాలా అరుదైన ప్ర‌క్రియ‌. నేష‌న‌ల్ మీడియా దృష్టి ఎప్పుడూ ఉత్త‌రాదికి ముంబై ప‌రిశ్ర‌మకే అంకిత‌మ‌య్యేది. కానీ కాలంతో పాటే మార్పు. ద‌క్షిణాది ప్ర‌తిభ ఎంత గొప్ప‌దో ఇటీవ‌ల అన్ని మీడియాలు అర్థం చేసుకుంటున్నాయి. మ‌న స్టార్ హీరోలు స్టార్ డైరెక్ట‌ర్ల‌ స‌త్తా ఏమిటో గ్ర‌హించాయి. అందుకే ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి మ‌రీ అవార్డు వేడుక‌ల కోసం ఆహ్వానిస్తున్నాయి.

తాను దిల్లీ వెళ్లిన‌ప్పుడు స్టార్ స్ట‌డ్ గ్యాల‌రీలో ఉత్త‌రాది స్టార్ల ఫోటోల‌ను మాత్ర‌మే వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి... త‌న ఫోటో కానీ ర‌జ‌నీకాంత్ లాంటి సూప‌ర్ స్టార్ ఫోటో కానీ ఆ గ్యాల‌రీలో లేక‌పోవ‌డంతో త‌మ ప్రాధాన్య‌త ఇంతేనా అని మ‌ద‌న ప‌డ్డాన‌ని ఒక సంద‌ర్భంలో అన్నారు. కానీ ఇక‌పై అలా జ‌ర‌గ‌దు అన‌డానికి నేటిత‌రం హీరోల‌కు ద‌క్కుతున్న గౌర‌వాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిశీలించే సంద‌ర్భం వ‌చ్చింది.

ప్ర‌తియేటా ఇండియా టుడే.. సీఎన్.ఎన్ - ఐబిఎన్... హిందూస్తాన్ టైమ్స్..వంటి అగ్ర జాతీయ మీడియా సంస్థ‌లు కాన్ క్లేవ్ ల పేరుతో అవార్డు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ లలో ఎక్కువగా బాలీవుడ్ ప్రముఖులకే ప‌రిమిత‌మ‌య్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాహుబ‌లి త‌ర్వాత బాహుబ‌లి ముందు స‌న్నివేశంలా.. ఇప్పుడు జాతీయ‌ మీడియా దృష్టి పూర్తిగా ద‌క్షిణాది స్టార్ల పైనే ఉంది. బాహుబలి- బాహుబ‌లి2- KGF- RRR లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ సినిమాల‌తో మ‌న స్టార్లు సృష్టించిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. బాహుబ‌లి స‌మ‌యంలో క‌ర‌ణ్ జోహార్ కాఫీ విత్ క‌ర‌ణ్ కోసం ప్ర‌భాస్ - రానా- రాజ‌మౌళి టీమ్ ని ఆహ్వానించి అద్భుత  టీఆర్పీల‌ను అందుకున్నాడు. ఇటీవ‌ల కేజీఎఫ్ స్టార్ య‌ష్.. ఆర్.ఆర్.ఆర్ స్టార్లు రామ్ చ‌ర‌ణ్ - తార‌క్ ల‌తోను స్పెష‌ల్ షో చేసిన క‌ర‌ణ్ టీఆర్పీ గేమ్ ని తెలివిగా ఆడాడు. ఇక పుష్ప విజ‌యం త‌ర్వాత బాలీవుడ్ మీడియా అంత‌టా మ‌న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హ‌వా కొన‌సాగింది.

ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కి మ‌రో అద్భుత అవ‌కాశం ద‌క్కింది.  మెగా హీరో రామ్ చరణ్ పాపుల‌ర్ హిందుస్థాన్ టైమ్స్ కాన్ క్లేవ్ లో పాల్గొనేందుకు  దిల్లీ వెళ్లారు. అతను RRR గురించి.. మొత్తం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల గురించి తన ఆలోచనలను ఈ వేదిక‌పై షేర్ చేసారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ అనేది అగ్ర మీడియా సార‌థ్యంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి ఆహ్వానించబడిన ఏకైక దక్షిణాది నటుడు రామ్ చరణ్. లీడర్ షిప్ సమ్మిట్ లో చెర్రీ ప్ర‌సంగం కోసం మెగాభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూసారు. క్రీడ‌లు రాజ‌కీయ రంగాల‌తో పాటు వినోద రంగంలోని ప్ర‌ముఖుల‌ను ఒక చోట చేర్చే ఈ వేదిక‌పై చ‌ర‌ణ్ ఏం మాట్లాడ‌టం విశేషం. #ఎన్ విజ‌నింగ్ ఏ న్యూ టుమారో అనే కాన్సెప్టుపై చెర్రీ స‌హా ఇత‌రులు మాట్లాడటం ఆస‌క్తిక‌రం. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్- బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో కలిసి అక్షయ్ కుమార్ హిట్ సాంగ్ తు చీజ్ బాడీ హై మస్త్ మస్త్ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా RRR విజయం గురించి రామ్ చరణ్ మాట్లాడారు. ఈ వేదిక‌పై చ‌ర‌ణ్ త‌న స‌హ‌చ‌రుడితో పాటు ఎంతో స్టైలిష్ గా సూట్ లో క‌నిపించారు.

ఇంత‌కుముందే ప్ర‌ఖ్యాత CNN న్యూస్ 18 నెట్ వర్క్ ఒక అవార్డ్ షోను నిర్వహించ‌గా..`పుష్ప` స్టార్ అల్లు అర్జున్ షో స్టాప‌ర్ గా నిల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ చిత్రంతో హిందీ పరిశ్రమలో తన అద్భుతమైన విజయానికి `ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022` అవార్డును బ‌న్ని అందుకున్నారు. అలాగే క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ ఇటీవల ఇండియా టుడే కాన్ క్లేవ్ కు హాజ‌ర‌య్యారు. KGF విజయం గురించి తన ఆనందాన్ని పంచుకోవ‌డ‌మే గాక‌.. దాదాపు 5 సంవత్సరాల క్రితం అతను ఫలితాన్ని ఎలా ఊహించాడో చెప్పాడు. మునుముందు ఇంకా ప‌లు జాతీయ చానెళ్లు మీడియా సంస్థ‌లు ప‌లు ఈవెంట్లు నిర్వ‌హించ‌నున్నాయి. కాంతార చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న రిష‌బ్ శెట్టికి ఈసారి వేడుక‌ల్లో ఆహ్వానం అందుతుంద‌న‌డంలో సందేహం లేదు.

అయితే అవార్డు వేడుక‌లు ఏవైనా కానీ... కేవ‌లం స్టార్ హీరోల‌ను మాత్ర‌మే పిలిచి వారిని మ‌లిచిన ద‌ర్శ‌కుల‌ను ఇత‌రుల‌ను మ‌ర్చిపోవ‌డం స‌రికాద‌నే విమ‌ర్శ ఉంది. వాస్త‌వానికి స్టార్ల‌ను త‌యారు చేసేది ద‌ర్శ‌కులు. బాహుబ‌లి- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల‌తో ప్ర‌భాస్- రామ్ చ‌ర‌ణ్‌- తార‌క్ ల‌ను పాన్ ఇండియా స్టార్లుగా మ‌లిచిన‌ది ది గ్రేట్ రాజ‌మౌళి అన్న సంగ‌తి తెలిసిందే. అలాగే కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో క‌న్న‌డ స్టార్ య‌ష్ ని గొప్ప పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టిన గట్సీ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. అలాగే కాంత‌ర చిత్రానికి సోలో హీరోగా న‌టిస్తూనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రిష‌బ్ శెట్టికి రెడ్ కార్పెట్ ఆహ్వానం అందించ‌డం అరుదైన గౌర‌వంగా నిలుస్తుంది. స్టార్ల వెంటే వారిని మ‌లిచిన ద‌ర్శ‌కులు అవార్డు వేదిక‌ల‌పై మ‌రింత‌గా గౌర‌వించ‌బ‌డాలి. దివంగ‌త ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు స‌హా ప‌లువురు నాటి రోజుల్లో ఇలాంటి స‌ల‌హాలు సూచ‌న‌లు చేసేవారు. కానీ ఇటీవ‌లి కాలంలో అలాటి సౌండ్ చేసేవాళ్లు టాలీవుడ్ లో క‌రువ‌య్యార‌న్న విమ‌ర్శ ఉంది.
Tags:    

Similar News