`పుష్ప‌`ను వ‌దులుకోవ‌డానికి కార‌ణం..?

అద్భుత‌మైన తెలివితేట‌ల‌తో డెసిష‌న్ మేకింగ్ లో సూప‌ర్ కింగ్ అన్న పేరుంది షారూఖ్‌కి.

Update: 2024-10-03 17:30 GMT

అద్భుత‌మైన తెలివితేట‌ల‌తో డెసిష‌న్ మేకింగ్ లో సూప‌ర్ కింగ్ అన్న పేరుంది షారూఖ్‌కి. త‌న‌ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ ని గొప్ప విజ‌య‌ప‌థంలో న‌డిపించిన ఘ‌నుడిగాను గుర్తింపు ఉంది. అందుకే షారూఖ్ ఒక మాట చెబితే దానిని ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ ఆద‌ర్శంగా భావిస్తారు. షారుఖ్ ఖాన్ ఇటీవల అబుదాబిలో జరిగిన 24వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో తన అసాధారణమైన హోస్టింగ్ ట్యాలెంట్ తో అహూతుల‌ను రంజింప‌జేసాడు. విక్కీ కౌశల్‌తో కలిసి హోస్టింగ్ చేసిన SRK ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన బ్లాక్‌బస్టర్ మూవీ జవాన్‌కి ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నాడు.

ఈవెంట్ లో ఖాన్- విక్కీ కౌశ‌ల్ జోడీ ఉల్లాసంగా ఆహ్లాదంగా ఈవెంట్ ని ర‌క్తి క‌ట్టించారు. హోస్టుల‌ ఫ‌న్ టైమింగ్ అందరినీ ఆక‌ట్టుకుంది. షారూఖ్ ఈ వేదిక‌పై హాస్యాస్పదంగా చేసిన ఒక కామెంట్ వేడెక్కించింది. అత‌డు ఏమ‌న్నాడంటే..? ఇతర స్టార్‌లకు ఆఫర్ చేసే ముందు పెద్ద సినిమా ప్రాజెక్ట్‌లు సాధారణంగా తనకే వస్తాయని పేర్కొన్నాడు. అమీర్ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ నటించిన ప్రతిష్టాత్మకమైన లాల్ సింగ్ చద్దా(2022) సహా పలు చిత్రాల గురించి విక్కీ నేరుగా ఖాన్ ని ప్ర‌శ్నించాడు.

అమీర్ కంటే ముందు `ఫారెస్ట్ గంప్` రీమేక్ మీ వ‌ద్ద‌కు వచ్చిందా? అని విక్కీ ప్ర‌శ్నించ‌గా ``అమీర్ ఖాన్ కూడా ఆ సినిమా చేయకూడదు`` అని స్పాంటేనియ‌స్‌గా చమత్కరించాడు. ప్రేక్షకులు ఖాన్ ప‌రిహాసానికి న‌వ్వుకున్నారు. ``నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమీర్!`` అంటూ త‌న‌దైన శైలిలో షారూఖ్ స‌న్నివేశాన్ని మేనేజ్ చేసాడు. హాలీవుడ్ క్లాసిక్ `ఫారెస్ట్ గంప్` స్ఫూర్తితో లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెర‌కెక్కంచారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్ ఫ్లాపైంది. ఈ సినిమాని రూ.180 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కించ‌గా, కేవలం రూ.130 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అమీర్ నటనపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అత‌డు నటన నుండి విరామం తీసుకున్నాడు.

ఆ తర్వాత `పుష్ప: ది రైజ్‌` గురించి విక్కీ ప్ర‌శ్నించారు. ఈ బ్లాక్‌బస్టర్‌లో భాగమయ్యే అవకాశాన్ని మీరు వదులుకున్నారా? అని విక్కీ షారూఖ్‌ను అడిగాడు. దానికి షారూఖ్ ఇలా సమాధానమిచ్చాడు. ``ఓ మై గాడ్, యార్! మీరు ఇప్పటికీ నా మ‌న‌సును బాధించేదాన్ని కెలికారు. నేను నిజంగా `పుష్ప` చేయాలనుకున్నాను.. కానీ నేను అల్లు అర్జున్ సర్ స్వాగ్‌(అద్భుత ప్ర‌తిభ ప్ర‌ద‌ర్శ‌న‌)తో సరిపోలలేకపోయాను అని అన్నారు. ఈ వ్యాఖ్యకు వేదిక వ‌ద్ద‌ హర్షధ్వానాలు, చప్పట్లతో హోరెత్తింది.

పుష్ప లో న‌ట‌న‌కు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఆ సినిమా సీక్వెల్ `పుష్ప 2: ది రూల్` డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు ఫహద్ వంటి ప్రతిభావంతులు న‌టిస్తున్నారు. పుష్ప 3 కూడా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News