మరోసారి రాజమౌళికి బీజేపీ ఎంపీ వార్నింగ్...!

Update: 2020-10-28 15:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. 'కొమురం భీమ్‌' గా ఎన్టీఆర్.. 'అల్లూరి సీతారామరాజు'గా రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే భీమ్‌ టీజర్ రిలీజయింది. గోండ్రు బెబ్బులి కొమురం భీమ్‌ అంటూ ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర తీరుతెన్నులని పరిచయం చేశారు. ఈ టీజర్ లో కొమురం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్ ఓ మతవిశ్వాసాలకు సంబంధించిన టోపీ ధరించినట్టు చూపించారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదమవుతోంది. భీమ్ కు టోపీ పెట్టడంపై ఆదివాసీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ సోయం బాపురావు దీనిపై రాజమౌళికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమాలో ఆదివాసీ పోరాటయోధుడు కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని.. నిజాం వ్యకులతో పోరాటం చేసిన భీమ్‌ కు ఇతర మతాలతో సంబంధం పెట్టి టోపీలు పెట్టడం సరైంది కాదని.. కలెక్షన్ల కోసం పాత్రను వక్రీకరిస్తే బాగోదని.. టోపీ ధరించి ఉన్న సన్నివేశాలని తొలగించాలని.. లేకపోతే సినిమా థియేటర్లపై దాడి చేసే అవకాశం ఉదని ఎంపీ బాపురావు హెచ్చరించారు. తాజాగా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మరోసారి రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎంపీ సోయం బాపూరావు ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ రాజమౌళి ఆదివాసీలను కించపరిచేలా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమాను తీస్తున్నారని ఆయన అన్నారు. ''కొమరం భీమ్ తలపై ఒక మతానికి చెందిన టోపీ పెట్టారు. కళ్ళకు సుర్మా పెట్టారు. చరిత్రలో కొమరం భీమ్ ఎప్పుడు ఆ వేషధారణలో లేరు. ఆదివాసీలను కించపరిచేలా చిత్రీకరిస్తున్నారు. రాజమౌళి విడుదల చేసిన టీజర్ లో కొమరం భీమ్ నీళ్లలోంచి బైటకు వస్తూ తలపై టోపీతో కనిపిస్తున్నాడు. ఇది ఆదివాసులను కించపరిచినట్టే అవుతుంది. రాజమౌళితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసాను. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. రాజమౌళికి ఇదే నా హెచ్చరిక.. ఇలాగే మొండిగా సినిమా విడుదల చేస్తే థియేటర్ లపై ఆదివాసీలు దాడులు చేస్తారు" అంటూ సోయం బాపూరావు రాజమౌళిని హెచ్చరించారు. మరోవైపు ఈ టీజర్ లో ఎన్టీఆర్ ను అలా చూపించిన దానికి కొమురం భీమ్ కథకు సంబంధం ఉండదని.. అయినా చిన్న టీజర్ ను చూసి మొత్తం సినిమాపైనే ఒక అంచనాకు రావడం సరికాదని.. సినిమా విడుదలైన తరువాత అందరికీ అర్థం అవుతుందని 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొమరం భీమ్‌ టోపీ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
Tags:    

Similar News