బర్త్ డే స్పెషల్ : పవర్ స్టార్ సినిమా అంటేనే ఓ లెక్కుంది...!

Update: 2020-09-02 11:30 GMT
పవన్ కళ్యాణ్ అనే పేరులోనే ఏదో తెలియని పవర్ ఉందంటారు ఆయన అభిమానులు. అందుకే పవర్ స్టార్ అనే పేరు వింటేనే ఆయన అభిమానులకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుందంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా కోసం ఎంత సాహసమైనా చేయడానికి సిద్ధపడే ఆయన తత్త్వం.. సినిమాల్లో అతను చూపించే మేనరిజం.. అతని స్టైల్.. డైలాగ్ డెలివరీ వంటివి పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోవింగ్ ని తెచ్చుపెట్టింది. పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లోనే యూత్ లో తిరుగులేని క్రేజ్ ని తెచ్చుకున్నారు. అందుకే అప్పట్లో యూత్ పవన్ లా ఉండాలని.. అతని హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతూ ఉండేవారు.

1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో అన్న అడుగుజాడల్లో ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్.. 'తమ్ముడు' 'తొలిప్రేమ' 'సుస్వాగతం' సినిమాలతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత 'బద్రీ.. బద్రీనాథ్' అంటూ సూపర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఇక 'ఖుషీ' సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసి స్టార్ హీరోగా మారిపోయాడు పవన్. 'జానీ' సినిమాతో హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో ప్లాప్స్ వచ్చినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అంచనాలను అందుకోవడంలో విఫలమైనా ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఎప్పటికప్పుడు సత్తా చాటుతూనే వచ్చాడు. అయితే 'జల్సా' సినిమాతో పవర్ స్టార్ స్టామినా మరోసారి రుచిచూపించాడు. అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డ్స్ ని చెరిపేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు.

ఇదే క్రమంలో 'గబ్బర్ సింగ్' 'అత్తారింటికి దారేది' వంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. నా సినిమాలకో తిక్కుంది.. దానికి బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కుంది అంటూ దూసుకుపోయాడు. తన కెరీర్లో కేవలం 25 సినిమాల్లో మాత్రమే నటించిన పవన్ కళ్యాణ్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. స్టార్ డైరెక్టర్ల వెనుక పరుగులు తీయకుండా వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిత్వంతో కూడా కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువై ఉన్నాడు పవన్. అయితే 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై ఫోకస్ పెడుతూ వచ్చాడు. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందినప్పటికీ పవన్ ప్రజాసేవ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆనందించారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకుని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కెరీర్లో ఎప్పుడు లేని విధంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూసే అవకాశం రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వేణు శ్రీరాం దర్శకత్వంలో 'వకీల్ సాబ్'.. క్రిష్ తో కలిసి ఓ పీరియాడికల్ మూవీ.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు పవన్ కళ్యాణ్. తన సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పరచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
Tags:    

Similar News