ఫోర్స్ చేసి ప‌వ‌న్ ను తిట్టించార‌న్న శ్రీ‌రెడ్డి

Update: 2018-04-18 08:09 GMT
సినీ న‌టి శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు సినిమాటిక్ మ‌లుపులు తిరుగుతోంది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పి.. దానిపై తాను పోరాడుతున్న‌ట్లుగా చెప్పిన శ్రీ‌రెడ్డి త‌ర్వాతి ద‌శ‌ల్లో ఆమె పోరాటం ఎన్ని మ‌లుపులు తిరిగిందో తెలిసిందే. మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఉద్దేశించి దారుణ వ్యాఖ్య‌లు చేయ‌టంతో పాటు.. ప‌వ‌న్ త‌ల్లిని అన‌కూడ‌ని మాట‌ను అనేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

దీనిపై ప‌వ‌న్ అభిమానులు భ‌గ్గుమ‌న్నారు. అంత‌వ‌ర‌కూ శ్రీ‌రెడ్డికి మ‌ద్ద‌తుగా నిలిచిన వారంతా కూడా ఆమెను త‌ప్పు ప‌ట్టారు. ఆమె మాట్లాడిన మాట‌లు ఏ మాత్రం స‌రైన‌వి కావ‌న్నారు. ఇలాంటివేళ‌..ఒక టీవీ చాన‌ల్ లో జ‌రిగిన చ‌ర్చ‌లో ఆమె భోరున విల‌పించారు. తన‌కు పోరాడే ఓపిక లేద‌ని.. అలిసిపోయిన‌ట్లుగా వ్యాఖ్యానించారు.

ఇంత కాలం తాను ఏ ఛాన‌ల్ లో అయితే చెల‌రేగిపోయారో.. అదే ఛాన‌ల్ లో ఆమె స‌మాధానం చెప్ప‌లేక.. నోట మాట రాని రీతిలో ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. కొద్ది గంట‌ల నుంచి వ‌రుస పెట్టి ఫేస్ బుక్ లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్న శ్రీ‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న పోస్టులు పెట్టారు.

త‌న‌ను వ్యూహాత్మ‌కంగానే ఛాన‌ల్ స్టూడియోకి పిలిచార‌ని.. అడుగ‌డుగునా కెమేరాలు ఏర్పాటు చేశార‌ని.. ఒక‌వైపు పాతిక మంది.. మ‌రో వైపు ముగ్గురు మాత్ర‌మే ఉండేలా ప్లాన్ చేసిన‌ట్లుగా ఆమె చెప్పారు. త‌మ‌ను చ‌ర్చ‌కు పిలిచిన ఛాన‌ల్‌.. కొద్ది స‌మ‌యం ముందే చ‌ర్చ ఉంద‌ని పిలిచిన‌ట్లుగా వెల్ల‌డించిన శ్రీ‌రెడ్డి.. మ‌హా ప్లాన్ వేయ‌టం ద్వారా త‌న‌ను ఇరికించార‌న్నారు. త‌మ‌కు కాస్త ముందుగానే ఈ ప్లాన్ తెలిసి ఉంటే తాము ఒక ప‌దిమందికి చాన‌ల్ లో చ‌ర్చ‌కు హాజ‌ర‌య్యే వాళ్ల‌మ‌ని చెప్పారు. ముందుగా స్కెచ్ వేసి మ‌రీ చ‌ర్చ‌కు పిలిచార‌ని.. త‌న‌కు ఆ విష‌యం త‌ర్వాత కానీ అర్థం కాలేద‌ని ఆరోపించారు.

తాజా ఆరోప‌ణ‌తో ఇప్ప‌టివర‌కూ శ్రీ‌రెడ్డి ఇష్యూను టెలికాస్ట్ చేసిన ఛాన‌ల్ మీద ఆమె నింద వేసిన‌ట్లైంది.  ఇదిలా ఉంటే.. పీకే కుటుంబానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు చెప్పిన శ్రీ‌రెడ్డి.. ఒక మ‌హా ఎత్తుగ‌డ‌లో త‌న‌ను పావును చేసిన‌ట్లుగా చెప్పింది. త‌న చేత ఒత్తిడి చేసి మ‌రీ ప‌వ‌న్ ను తిట్టించార‌న్నారు. తాను బై ఫోర్స్ తో తాను ఆ మాట‌ను అన్న‌ట్లుగా ఆమె చెప్పింది. త‌న పోరాటాన్ని తూట్లు పొడిచేందుకు ప్ర‌య‌త్నం చేశారంటూ కొత్త త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేశారు.

త‌న పోరాటాన్ని దెబ్బ తీసే ప్ర‌య‌త్నం చేసిన వాళ్లంతా తాను ఓడిపోలేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. కానీ వారి రాజ‌కీయ ఎత్తుగ‌డ కార‌ణంగా  త‌న పోరాటం దెబ్బ తిన్న‌ద‌ని పేర్కొన్నారు. చూస్తుంటే.. ఛాన‌ళ్ల‌కు కాకుండా ఫేస్ బుక్ తో త‌న త‌దుప‌రి పోరాటాన్ని శ్రీ‌రెడ్డి చేప‌ట్ట‌నుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మార‌నుంది.
Tags:    

Similar News