కొద్ది రోజుల క్రితం వరకూ రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు టాలీవుడ్ లో కూడా శ్రీరెడ్డి పేరు తెలిసిన వారు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఇపుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పేరు మార్మోగిపోతోంది. శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శనపై ప్రతిష్టాత్మక న్యూయార్స్ టైమ్స్ లో కూడా కథనం వచ్చిందంటే శ్రీరెడ్డి ఎంత పాపులర్ అయిందో చెప్పవచ్చు. ఇక సోషల్ మీడియాలో అయితే, శ్రీరెడ్డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఫేస్ బుక్ లో ఆమెకు దాదాపు 60 లక్షల మంది ఫాలోవర్స్, లైకర్స్ ఉండగా....ట్విట్టర్ లో శ్రీరెడ్డిని 22 వేల మంది ఫాలో అవుతున్నారు. కారణం ఏదైనా...శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్...ట్వీట్ కు నిమిషాల్లో వేల కొద్దీ లైక్ లు, షేర్ లు, వ్యూస్ వస్తున్నాయంటే ఆమెకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇంతటి ఫాలోయింగ్...ఇంతమంది మద్దతు ఉన్న శ్రీరెడ్డి చేసిన ఒకే ఒక్క కామెంట్...ఆమెకు ఇదే స్థాయిలో వ్యతిరేకతను తీసుకువచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ ను, ఆమె తల్లిని ఉద్దేశించి తీవ్ర అసభ్య పదజాలంతో దుర్భాషలాడడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పవన్ పై వ్యాఖ్యలతో శ్రీరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి శ్రీరెడ్డి ఇష్యూపై స్పందించిన తొలి స్టార్ హీరో, రాజకీయనాయకుడు కూడా పవనే. తమకు జరిగిన అన్యాయాలపై పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్లాలని సూచించిన పవన్ ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా....పవన్ ను అన్న అన్నందుకు చెప్పుతో కొట్టుకోవడం వంటి కార్యక్రమాలను చేయడంతో శ్రీరెడ్డి ఇమేజ్ తీవ్రస్థాయిలో డ్యామేజీ అయింది. ఆడవాళ్ల సమస్యలపై పోరాడుతోన్న శ్రీరెడ్డి....సాటి ఆడదానిని ఉద్దేశించి....అందులోనూ ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయని పవన్ ను ఉద్దేశించి ఆ తరహా వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది.
అసలు పవన్ ఊసు ఎత్తకుండా....తన పోరాటాన్ని శ్రీరెడ్డి కొనసాగించి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. గతంలో శ్రీరెడ్డిపై సింపతీ చూపించిన మాధవీలత కూడా పవన్ కు మద్దతుగా మౌన దీక్షకు కూర్చుందంటే శ్రీరెడ్డి గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా...తన వైఖరితో నా అనుకున్న వారిని దూరం చేసుకుంటూ పోతే....ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి పోస్ట్ చేసినట్లు చివరకు `ఏకాకి`గానే మిగులతుంది. ఆ ఫాలోవర్స్ నుంచి తనకు వస్తోన్న ఆదరణను శ్రీరెడ్డి సక్రమంగా వినియోగించుకోకపోతే....భవిష్యత్తులో తీవ్ర నిరాదరణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే ప్రూవ్ అయింది. ఇకనైనా, తన పోరాటం పక్కదారి పట్టకుండా....తాను లేవనెత్తిన సమస్యలపైనే గళం విప్పి.....శ్రీరెడ్డి నిర్మాణాత్మకంగా అడుగులు వేయకపోతే ఆమెది `ఒంటరి`పోరాటమే అవుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.