# శ్రీ‌రెడ్డి....నెక్స్ట్ ఏంటి?

Update: 2018-04-13 15:53 GMT
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, మ‌హిళా ఆర్టిస్టుల‌పై లైంగిక వేధింపుల‌పై గతంలో కూడా చాలామంది న‌టీమ‌ణులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు త‌మ గ‌ళం విప్పారు. కానీ, కాస్టింగ్ కౌచ్ పై న‌టి శ్రీ‌రెడ్డి చేప‌ట్టిన నిర‌స‌న జాతీయ వ్యాప్తంగానే కాకుండా అంత‌ర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆక‌ర్షించింది. ఆమె అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌పై కొంత‌మంది అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.....త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ఆమె పోరాడుతున్న తీరు ప‌లువురిని ఆక‌ట్టుకుంది. ఇండ‌స్ట్రీలో ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన కాస్టింగ్ కౌచ్ పై శ్రీ‌రెడ్డి నిర‌స‌న ఫలితాన్నిచ్చింది. చాలాకాలంగా టాలీవుడ్ లో ఏర్పాటు కాని `క్యాష్ క‌మిటీ`...శ్రీ‌రెడ్డి నిర‌స‌న వ‌ల్ల సాధ్య‌మైంది. ఎన్నో ఏళ్లుగా చాప కింద నీరులా ఉన్న కాస్టింగ్ కౌచ్ ను ఒక్క సారిగా వెలుగులోకి తెచ్చింది శ్రీ‌రెడ్డి. ఒక్క శ్రీ‌రెడ్డే కాదు...ఆమెలా అన్యాయానికి గురైన చాలామంది త‌మ వాణిని వినిపించేందుకు ముందుకు వ‌చ్చారు.

అయితే, శ్రీ‌రెడ్డి పోరాటం వల్ల‌నో....మ‌హిళా సంఘాలు, యువ‌జ‌న సంఘాలు, మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ ల ఒత్తిళ్ల వ‌ల్ల‌నో `మా` కొన్ని దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న `క‌మిటీ ఎగైనెస్ట్ సెక్సువ‌ల్ హ‌రాస్ మెంట్ (క్యాష్-CASH)` ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. టాలీవుడ్ లో నటీమణులు, జూనియ‌ర్ ఆర్టిస్టులు, మ‌హిళ‌ల‌పై వేధింపులను అరిక‌ట్టి ప‌రిష్క‌రించేందుకు ఆ కమిటీ ఏర్పాటు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించింది. ఇండ‌స్ట్రీలో ప‌నిచేసే ప్ర‌తి మ‌హిళ త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ల‌ను ఆ క‌మిటీకి వివ‌రించ‌వ‌చ్చ‌ని, ఫిర్యాదు చేసేందుకు `మా`లో స‌భ్య‌త్వం ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది.

అయితే, `మా`  ప్రెస్ మీట్ పై  ఓ లైవ్ షో లో శ్రీ‌రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేసింది. `మా` స‌భ్యుల ప్ర‌క‌ట‌న త‌న‌కు 20 శాతం మాత్రమే సంతోషాన్నిచ్చిందని, అసలు త‌న ప్ర‌ధాన‌ డిమాండ్లపై ‘మా’ స్పందించలేదని చెప్పింది. తన పోరాటం త‌న ఒక్కదాని గురించి కాద‌ని, త‌న‌లా అన్యాయానికి గురైన అమ్మాయిల‌కు న్యాయం జ‌ర‌గాల‌ని చెప్పింది. మ‌హిళా, యువ‌జ‌న సంఘాల‌తో క‌లిసి త‌న పోరాటం కొనసాగుతుందని తెలిపింది. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని, కో ఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థను రూపుమాపాల‌ని, 75 శాతం మంది తెలుగు వాళ్ల‌కే అవ‌కాశాలివ్వాల‌ని, ఆడిష‌న్స్ అన్నీ...ఫిల్మ్ చాంబ‌ర్ లో నే జ‌ర‌గాల‌ని శ్రీ‌రెడ్డి డిమాండ్ చేస్తోంది. అయితే, ఇక‌పై శ్రీ‌రెడ్డి పోరాటం ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఆస‌క్తి కరంగా మారింది. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కు తెలంగాణ స‌ర్కార్, టాలీవుడ్ పెద్ద‌లు ఏం వివ‌ర‌ణ ఇవ్వ‌బోతున్నారు....భ‌విష్య‌త్తులో శ్రీ‌రెడ్డి ఏ త‌ర‌హాలో పోరాటం చేయ‌బోతోంది....ఆమెకు యువ‌జ‌న‌,మ‌హిళా సంఘాలు, మీడియా మ‌ద్ద‌తు ఏవిధంగా ఉండ‌బోతోంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News