ఇంద్ర‌లోకంలో శ్రీ‌దేవి తొలి బ‌ర్త్‌ డే

Update: 2018-08-13 04:57 GMT
ఇంద్ర‌లోకంలో నుంచి అంగుళీకం జారి ప‌డ‌క‌పోతే ఎంత ప‌ని జ‌రిగేదో? అది త‌లుచుకుంటేనే భూలోవాసుల‌కు నిదుర ప‌ట్ట‌దు. అతిలోక సుంద‌రి లేని లోకాన్ని, దేవ‌త క‌నిపించ‌ని ఈ లోకాన్ని అస్స‌లు ఊహించ‌లేరెవరూ. అభిమాన తార‌ శ్రీ‌దేవి లేదు అన్న నిజం తెలిసినా ఇంకా ఇంకా అభిమానుల క‌ళ్లు త‌న‌కోస‌మే వెతుకుతున్నాయి. ఇంద్ర‌లోక‌పు రాకుమారి అంద‌రికీ షాకిచ్చి ఆక‌స్మికంగా అంత‌ర్ధాన‌మైపోయింది. అయినా ఇంకా తిరిగొస్తుంద‌నే ఆశ‌తో అంతా ఎదురు చూస్తున్నారు.

తాను రాక‌పోతేనేం.. అమృత క‌ల‌శంలోంచి ఒక్కో బొట్టు అమృతాన్ని ఒలికించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి వెళ్లింది. వాటితోనే ప్రాణం లేచొస్తోంది అంద‌రికీ. శ్రీ‌దేవి రాక‌తో ఇంద్ర‌లోకంలో రంభ - ఊర్వ‌శి - మేన‌క‌ల‌కు కంటిపై కునుకు క‌రువై ఉండాలి. ఏదైతేనేం దుబాయ్ ఎమిరేట్స్‌ లో చిల‌క ఎగిరిపోయింది. పెళ్లి పేరుతో పిలిచి య‌ముడు శ్రీ‌దేవిని బంధించాడు. ఆ దుర్ఘ‌ట‌న ఇప్ప‌టికీ అభిమానుల గుండెల్ని క‌ల‌చి వేస్తూనే ఉంది. ఈలోగానే శ్రీ‌దేవి తొలి జ‌యంతి అంటూ .. అభిమానులు దీపం వెలిగించి ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

1963 ఆగస్టు 13న శ్రీ‌దేవి జ‌న్మించారు. త‌మిళ‌నాడు శివ‌కాశీ స్వ‌స్థ‌లం. శ్రీ‌ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ అస‌లు పేరు. రంగుల ప్ర‌పంచంలో శ్రీ‌దేవిగా మారారు. తెలుగు - త‌మిళం - మ‌ల‌యాళం - క‌న్న‌డం - హిందీ ప‌రిశ్ర‌మ ఏదైనా అన్నిచోట్లా అంద‌రు సూప‌ర్‌ స్టార్ల స‌ర‌స‌న న‌టించారు. అతిలోక సుంద‌రిగా అభిమానుల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచారు. శ్రీ‌దేవి త‌ర్వాత త‌న కూతుళ్ల‌లో త‌న‌ని వెతుక్కోవ‌డం ప్రారంభ‌మైంది. అభిమానుల‌కు అదో ఊర‌ట‌.

24 ఫిబ్ర‌వ‌రి 2018 శ్రీ‌దేవి దుబాయ్‌ లో యాక్సిడెంట‌ల్ డెత్ దృశ్యాలు ఇంకా క‌ళ్ల‌లో మెదులుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికి బోనీక‌పూర్ ఫ్యామిలీ నెమ్మ‌దిగా ఈ  విషాదం నుంచి కోలుకుంటోంది. శ్రీ‌దేవి తొలి కుమార్తె జాన్వీ ధ‌డ‌క్ చిత్రంతో విజ‌యం అందుకుంది. ఈ విజ‌యాన్ని దేవ‌త ఇంద్ర‌లోకం నుంచే వీక్షించి సంతోషించింది. త‌ర్వాత రెండో కుమార్తె ఖుషీ క‌పూర్ క‌థానాయిక‌గా తెరంగేట్రం చేయాల్సి ఉంది. అన్నిటినీ పైనుంచి అమ్మ వీక్షిస్తూనే ఉన్నారు. నేడు జ‌యంతి సంద‌ర్భంగా న్యూడిల్లీ- మ‌హ‌దేవ్ రోడ్‌ లోని ఫిలింస్ డివిజ‌న్ ఆడిటోరియంలో రెండురోజుల పాటు శ్రీ‌దేవి సినిమాల్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. స‌మాచార ప్ర‌సారాల శాఖ ఈ ఉత్స‌వాల్ని నిర్వ‌హిస్తోంది. జాతీయ అవార్డు గ్ర‌హీత‌ - ప‌ద్మ‌శ్రీ శ్రీదేవి సంస్మ‌రణం త‌న సినిమాల్ని వీక్షించ‌డ‌మేన‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News