శ్రీకాంత్‌ సార్‌.. ఎందుకీ వృథా ప్రయాస

Update: 2015-03-19 19:30 GMT
శ్రీకాంత్‌ హీరోగా నటించిన చివరి హిట్టు సినిమా ఏదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అదంత సులభం కాదు. ఎందుకంటే ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట వచ్చిన 'ఆపరేషన్‌ దుర్యోదన' శ్రీకాంత్‌ చివరి హిట్టు సినిమా. దానికంటే ముందు ఎప్పుడు హిట్టు కొట్టాడో చెప్పడం ఇంకా కష్టం. 'ఆపరేషన్‌ దుర్యోదన' తర్వాత ఓ పాతిక సినిమాలైనా వచ్చి ఉంటాయి కానీ. అందులో ఏదీ ఆడలేదు. కాస్తో కూస్తో క్రేజ్‌ తెచ్చుకున్న సినిమాలంటే.. మహాత్మ, విరోధి మాత్రమే. అవి కూడా నిలబడలేదు. గత రెండు మూడేళ్లుగా శ్రీకాంత్‌ సినిమాలు విడుదలవుతున్న సంగతి కూడా ఎవరికీ పట్టడం లేదు.

కానీ శ్రీకాంత్‌కు హీరో వేషాలపై మోజు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి ట్రెండుకు తన లాంటి హీరోలు సెట్‌ కారని అర్థమవుతున్నా శ్రీకాంత్‌ అస్సలు తగ్గట్లేదు. మొండోడు, జల్సా రాయుడు, నాటుకోడి, వీడికి దూకుడెక్కువ, ఢీ అంటే ఢీ.. ఇలా ఎవరికీ పట్టని సినిమాలు చాలానే చేస్తున్నాడు శ్రీకాంత్‌. తాజాగా 'మెంటల్‌ పోలీస్‌' పేరుతో ఇంకో సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. స్టార్‌ హీరోలు చాలామంది ఇప్పటికే మెంటల్‌ పోలీసులుగా చేయాల్సిన సందడంతా చేసేశారు. అవి చాలవని శ్రీకాంత్‌ తయారయ్యాడు. జగపతి బాబు కంటే చాలా ముందే క్యారెక్టర్‌ రోల్స్‌ చేయడానికి రెడీ అయిన హీరో శ్రీకాంత్‌. బుద్ధిగా అలాంటి క్యారెక్టర్లే చేస్తే బిజీ ఆర్టిస్టుగా ఉంటాడు. ఈ హీరో వేషాలు వృథా ప్రయాస తప్పితే మరేమీ కాదు.

Tags:    

Similar News