అనుకొన్నదే అయ్యింది. 2015లో తెలుగు చిత్ర పరిశ్రమకి కాసుల వర్షం కురిపించిన బాహుబలి... శ్రీమంతుడు చిత్రాలే ఐఫా వేడుకల్లో హవా ప్రదర్శించాయి. ఒక్క కామిక్ రోల్ అవార్డు తప్ప మిగతా అన్నింటినీ ఆ రెండు చిత్రాలే పంచుకోవడం విశేషం. లీడింగ్ యాక్టర్ - లీడింగ్ యాక్ట్రెస్ - బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - బెస్ట్ లిరిసిస్ట్ అవార్డులు శ్రీమంతుడు సినిమాకి లభించాయి. బెస్ట్ పిక్చర్ - బెస్ట్ డైరెక్టర్ - బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ - బెస్ట్ నెగిటివ్ రోల్ అవార్డుల్ని బాహుబలిని వరించాయి. తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన బాహుబలికి తమిళం, మలయాళం తరఫున కూడా బోలెడన్ని పురస్కారాలు లభించిన విషయం తెలిసిందే. బెస్ట్ కామిక్ రోల్ అవార్డు భలే భలే మగాడివోయ్ లో నటనకుగానూ వెన్నెలకిషోర్ కి లభించింది. బెస్ట్ లీడింగ్ యాక్టర్ పురస్కారాన్ని అందుకోవడానికి మహేష్ వేదికనెక్కినప్పుడు ఐఫా ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. మహేష్ స్టన్నింగ్ లుక్ తో వేడుకకి హాజరయ్యాడు. ఆయన శ్రీమతి నమ్రత కూడా ఆయన వెంట ఉన్నారు. అవార్డులు ఎవరికి వచ్చినా, ఎవరికి రాకపోయినా సినీ తారలంతా ఒక వేదికపైకి చేరి హుషారుగా కనిపించారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొన్నారు.