శ్రీమంతుడు హిట్టయితే బాహుబలి సీనేంటి?

Update: 2015-08-06 11:08 GMT
బాహుబలి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల దండయాత్ర సాగిస్తోంది. 500 కోట్లు నుంచి 600కోట్లు వసూలు చేసే దిశగా పయనం సాగిస్తోంది. ఇప్పటికీ థియేటర్లు కిటకిటలాడుతున్నాయని పంపిణీదారులు చెబుతున్నారు. అయితే ఈ దూకుడును శ్రీమంతుడు తగ్గిస్తాడా? తగ్గిస్తే బాహుబలి 600కోట్ల క్లబ్‌ లో అడుగుపెట్టగలడా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

శ్రీమంతుడిని ఇప్పటికే భారీగా థియేటర్ల లో రిలీజ్‌ చేస్తున్నారు. ఆ మేరకు థియేటర్ల సర్ధుబాటు సాగుతోంది. కాబట్టి తొలి మూడు రోజులు బాహుబలి హవా తగ్గే అవకాశం ఉంది. శ్రీమంతుడు సూపర్‌ హిట్టు అన్న టాక్‌ వస్తే వారం పాటు బాహుబలి కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతుంది. ఒకవేళ యావరేజ్‌ అన్న టాక్‌ వస్తే మాత్రం బాహుబలి కొంతవరకూ మిగిలినట్టే.

అయితే బాహుబలిని అభిమానించే ప్రేక్షకులు పదే పదే ఈ సినిమాని రిపీటెడ్‌ గా చూస్తున్నారు కాబట్టి అలాంటి వారిపై ఏ ఇతర సినిమా ప్రభావం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే శ్రీమంతుడు చూసినా బాహుబలిని మరోసారి చూడాలనుకుంటే ఆ మేరకు జక్కన్న సినిమాకి ఇబ్బంది ఉండదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే బాహుబలికి మెజారిటీ షేర్‌ వచ్చింది. ఓవర్సీస్‌ నుంచి భారీ వసూళ్లు వచ్చాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో బాహుబలికి అడ్డుకట్ట వేసే సినిమా శ్రీమంతుడు కాకూడదు. తెలుగు సినిమా ఖ్యాతిని 600కోట్లకు విస్తరించే సత్తా ఉన్న చిత్రమిది... కాబట్టి బాహుబలి హవా సాగాలనే కోరుకుందాం.

అయినా బాహుబలి జోనర్‌ కి, శ్రీమంతుడు జోనర్‌ కి ఏమాత్రం సంబంధం లేదు. రెండూ డిఫరెంట్‌ జోనర్స్‌. కొత్తమోజులో శ్రీమంతుడు హవా వారం పాటు సాగనిచ్చినా..  మళ్లీ బాహుబలి కలెక్షన్లు పుంజుకుని ఆసాధారణ వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Tags:    

Similar News