'ఆచార్య' కు పోటీగా స్టార్ క్రికెటర్ బయోపిక్..!

Update: 2021-12-05 04:30 GMT
బాలీవుడ్ లో బయోపిక్స్ హవా కొనసాగుతోంది. అందులోనూ క్రీడాకారుల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన సినిమాలు ఎక్కువగా వచ్చాయి. వాటిలో డాక్యుమెంటరీ తరహాలో తీసిన బయోపిక్స్ నిరాశ పరచగా.. భావోద్వేగాలు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కలబోసి తీసిన సినిమాలు విజయం సాధించాయి.

ఇప్పటి వరకు మిల్కాసింగ్‌ - ధోనీ - మేరీకోమ్‌ - అజహరుద్దీన్‌ - సచిన్‌ టెండూల్కర్ - సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారుల బయోపిక్స్ తెర మీదకు వచ్చాయి. కపిల్ దేవ్ బయోపిక్ గా రూపొందిన '83' డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రముఖ భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌ లైఫ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

లేడీ సచిన్ గా పేరుగాంచిన హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ''శభాష్ మిథూ''. ఇందులో సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నూ టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు.

డిసెంబర్‌ 3న మిథాలీ రాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని 'శభాష్ మిథు' సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మిథాలీ గెటప్ లో ఉన్న తాప్సి ఇంటెన్స్ పోస్టర్ ని ఆవిష్కరించారు.

''ఒక అమ్మాయి తన క్రికెట్ బ్యాట్‌ తో ప్రపంచ రికార్డులు మరియు మూస పద్ధతులను బద్దలు కొట్టింది. నువ్వు నిజమైన ఛాంపియన్‌. హ్యాపీ బర్త్‌ డే మిథూ'' అని మేకర్స్ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ లో మిథాలీ రాజ్ ప్రస్థానం.. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఈ సినిమాలో చూపించనున్నారు.

ఇందులో మిథాలీ రాజ్ గా కనిపించడానికి తాప్సి తీవ్రంగా శ్రమించింది. సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందు నుంచే సీరియస్ గా క్రికెట్ ప్రాక్టీస్ చేసింది. దీని కోసం మిథాలీ నుంచి మెళకువలు నేర్చుకుంది. మిథాలీ స్నేహితురాలు నూషిన్ అల్ ఖాదర్ శిక్షణలో బ్యాటింగ్ - బౌలింగ్ నేర్చుకుందని తెలుస్తోంది.

'శభాష్ మిథు' చిత్రానికి శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అమిత్‌ త్రివేది సంగీతం సమకూరుస్తుండగా.. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

మిథాలీ రాజ్ బయోపిక్ ని హిందీతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేసే అవకాశం ఉంది. అదే జరిగితే తెలుగులో 'ఆచార్య' వంటి పెద్ద సినిమాతో తాప్సి పోటీ పడాల్సి వస్తుంది. ఎందుకంటే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4ని లాక్ చేశారు. మరి రాబోయే రోజుల్లో విడుదల తేదీల్లో మార్పులు జరుగుతాయేమో చూడాలి.
Tags:    

Similar News