హిట్టు కొట్టినా రూ. కోటి మాత్రమే రేటు పెంచిన సీనియర్ స్టార్ హీరో..?

Update: 2022-05-07 05:31 GMT
టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ కోట్ల‌కు కోట్లు పారితోషికంగా అందుకొంటున్నారు. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే సూత్రాన్ని వంటబట్టించుకొని.. డబ్బుల విషయంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

ఒక మోస్తరు హిట్ వస్తేనే.. ఆటోమేటిక్ గా తదుపరి ప్రాజెక్ట్ కు రేటు పెంచేస్తున్నారు మన హీరోలు. అలాంటిది ఓ బ్లాక్ బస్టర్ వస్తే.. యాభై నుండి వంద శాతం వరకూ పెంచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ విషయంలో వర్తించదని తెలుస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ' చిత్రంతో నటసింహం బాలకృష్ణ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన కెరీర్ లో 107వ సినిమా చేస్తున్నారు.

'అఖండ' సినిమా రిలీజ్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు #NBK107 రెమ్యునరేషన్ విషయం మీద బాలయ్యతో చర్చించారు. అఖండ రెమ్యునరేషన్‌ పై సగమైనా పెంచుతారని మేకర్స్ భావించారట. అయితే బాలయ్య మాత్రం ముందు సినిమా కంటే ఒక కోటి రూపాయలు ఎక్కువ ఇస్తే చాలని అన్నారట.

బాలకృష్ణ 'అఖండ' సినిమా కోసం సుమారు 11 కోట్లు + జీఎస్టీ అందుకున్నాడట. అందులోనూ 2 కోట్లు సినిమా సక్సెస్ అయిన తర్వాత తీసుకున్నారట. అయితే ఇప్పుడు #NBK107 కోసం ఆయన 12 కోట్లు + జీఎస్టీ అందుకోబోతునన్నారని ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించి సినిమాలు చేస్తున్న మైత్రీ నిర్మాతలు.. బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య తన రెమ్యునరేషన్ ను ఒక కోటి మాత్రమే పెంచడాన్ని చూసి ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని తమ సన్నిహితుల దగ్గర చెప్పి సీనియర్ హీరోని కొనియాడుతున్నారట.

కాగా, #NBK107 చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హై ఇంటెన్స్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఒక పాత్రకు సంబంధించిన లుక్ ఆకట్టుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ - దునియా విజయ్ - లాల్ - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నవీన్ యెర్నేని - వై రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి మాధవ్‌ బుర్రా సినిమాలో డైలాగ్స్ రాస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News