డ్ర‌గ్స్‌ పై సంజ‌య్‌ద‌త్ ఏం చెప్పాడో తెలుసా?

Update: 2017-09-18 05:21 GMT
బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్‌ద‌త్‌కు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు. ముంబైలో అయితే కొంద‌రిళ్ల‌లో సంజ‌య్ ఫొటోలు కూడా మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. అంత‌పిచ్చి ఈ హీరో అంటే. అలాంటి సంజయ్ ద‌త్‌.. అనేక వివాదాల్లో చిక్కుకుని కోర్టు కేసులు కూడా ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. కొన్ని ఏళ్ల‌పాటు జైలు జీవితం కూడా అనుభ‌వించిన ఆయ‌న ప్ర‌స్తుతం ఆయా కేసుల నుంచి విముక్తుడ‌య్యాడు కూడా. తాజాగా ఆయ‌న త‌న మ‌న‌సులో మాట‌ను పంచుకున్నాడు. త‌న బాల్యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌తి విష‌యాన్నీ ఆయ‌న చెప్పుకొచ్చాడు. త‌ను ఎదుర్కొన్న అనేక సంఘ‌ట‌ల‌ను పూస‌గుచ్చాడు. త‌న‌లాగా ఎవ‌రూ ఉండ‌కూడ‌ద‌ని పిలుపునివ్వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది.

ఇటీవ‌ల ముంబైలోని ఓ మాధ్య‌మిక పాఠ‌శాల‌లో స‌ద‌స్సు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా సంజ‌య్‌ను ఆహ్వానించారు. దీనికి ఎంతో ప్ర‌త్యేకంగా వ‌చ్చిన సంజ‌య్‌.. విద్యార్థుల‌ను ఉద్దేశించి చాలా ఉద్విగ్నంగా మాట్లాడాడు. త‌న జీవితాన్ని అధ్య‌య‌నం చేయాల‌ని చెప్పిన సంజ‌య్‌.. త‌న జీవితాన్ని అధ్య‌య‌నం చేస్తే.. ఎలా ఉండ‌కూడ‌దో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌డంతో అంద‌రూ నిర్ఘాంత పోయారు. నిజానికి ఎవ‌రైనా సెలిబ్రిటీ.. త‌న జీవితం నుంచి అది నేర్చుకోండి. ఇది నేర్చుకోండి అని లెక్చ‌ర్లు ఇస్తారు. కానీ, సంజ‌య్ మాత్రం త‌న జీవితాన్ని చ‌దివి ఎలా ఉండ‌కూడ‌దో నేర్చుకోవాల‌ని విద్యార్థుల‌కు విజ్ఞ‌ప్తి చేశాడు. అంతేకాదు త‌న కొడుకు కూడా త‌న‌లాగా కాకూడ‌ద‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పాడు. దీనికిగాను భ‌గ‌వంతుణ్ణి సైతం కోరుతున్నాన‌ని అన్నాడు.

‘‘నేను దేవుడిని ప్రార్థించేది ఒక్కటే.. నా కుమారుడు నా మాదిరి తయారవ్వకూడదు’’ అని చెప్పాడు. బాలీవుడ్‌ హీరోగా పేరుప్రఖ్యాతలు సాధించినా.. డ్రగ్స్‌, అక్రమాయుధాల కేసులో ఇరుక్కొని తాను అనుభ‌వించిన జీవితం ఎవ‌రికీ రాకూడ‌ద‌ని చెప్పాడు. తన కుమారుడికి కష్టం విలువ తెలిసేలా పెంచుతానన్నాడు. తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వాలని విద్యార్థుల‌కు విజ్ఞ‌ప్తి చేశాడు.  చెడు స్నేహాల పట్ల ఆకర్షితులు కావొద్దన్నాడు. కాలేజీ రోజుల్లోనే తాను డ్రగ్స్‌కు బానిసయ్యానని, ఇది నిజ‌మ‌ని చెప్పాడు. అంతేకాదు ఈ డ్ర‌గ్స్ బారి నుంచి బయటపడేందుకు తనకు పదేళ్లు పట్టిందన్నాడు. డ్రగ్స్‌ మానేసిన తర్వాత జీవితం ప్రత్యేకంగా కనిపించిందని, డ్రగ్స్‌ జోలికి పోవద్దని ప‌దే ప‌దే హెచ్చ‌రించాడు. జీవితం, చేసేపని, కుటుంబం పట్ల శ్రధ్ధ పెట్టాలని హిత‌వు ప‌లికాడు.

అప్పుడే అత్యున్నత స్థాయికి ఎదుగుతారని విద్యార్థుల‌కు జీవిత స‌త్యాలు నూరి పోశాడు. దీనిపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌గా.. బాలీవుడ్ న‌టులు స‌హా ఆయ‌న అభిమానుల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది.``మా హీరో మారిపోయాడు` అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో ఆనందం వ్య‌క్తం చేయ‌గా.. `మారిన మ‌నిషి అంటే సంజ‌య్` అని బాలీవుడ్ కొనియాడింది.
Tags:    

Similar News