సినిమాలకి కథల్లేవ్ .. నవలల పైనే ఆధారం!

Update: 2022-06-04 03:00 GMT
సినిమాలు చేయాలన్నా .. వెబ్ సిరీస్ లు చేయాలన్నా కథలు కావాలి. కానీ కథలన్నీ కంచికి పోయాయి గనుక .. ఇక కథల్లేవ్ అనేస్తున్నారు. కథలు నిజంగానే లేవా? లేదంటే తయారు చేసుకునేంత తీరిక లేదా? అంటే ఎవరికి తోచిన సమాధానం వాళ్లు చెబుతారు. ఏదో ఒక లైన్ అనుకుని .. దానిపై కసరత్తు చేసి .. ఆ తరువాత మార్పులు .. చేర్పులు అంటే అక్కడే చాలా సమయం అయిపోతుందనే ఆలోచన లేకపోలేదు. అందువల్లనే ఈ మధ్య కాలంలో మళ్లీ నవలలపైకి దృష్టి పోతోంది. నవలను సినిమాలుగా తీయడమనే ఆచారం చాలాకాలం క్రితమే మొదలైపోయింది.

అప్పట్లో ఏఎన్నార్ .. శోభన్ బాబు ఎక్కువగా నవల ఆధారంగా రూపొందిన సినిమాలలో చేశారు. అవి చాలా వరకూ హిట్ అయ్యాయి. ఇక ఆ తరువాత యండమూరి నవలలను చిరంజీవితో చేస్తే అవి కూడా చాలావరకూ హిట్టే.

ఆ తరువాత మాత్రం నవలల వైపు వెళ్లింది చాలా తక్కువ. కృష్ణ - విజయ నిర్మల కాంబినేషన్లో నిర్మితమైన 'మీనా' నవలా కథాంశమే. అదే కథను 'అ ఆ' టైటిల్ తో త్రివిక్రమ్ చేయగా మళ్లీ హిట్ అయింది. ఆ తరువాత మళ్లీ నవల ఆధారంగా వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది 'కొండ పొలం' అని చెప్పాలి.

ఒకప్పుడు ప్రధానమైన వినోద సాధనం సినిమానే. ఇప్పటికీ కూడా దాని వన్నె తగ్గలేదు. కాకపోతే సినిమా అనే  వినోదాన్ని అందించే సంస్థలు పెరిగాయి. అవి ఓటీటీల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అమెజాన్  ప్రైమ్ .. నెట్  ఫ్లిక్స్ .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు ఆహరం ఎక్కువ కావాలి. వినోద ప్రపంచాన్ని విస్తరించడానికి అన్నిటీకి కావలసిన అత్యవసర .. నిత్యవసర ఆహారం కథనే. అలాంటి కథ కోసమే ఇప్పుడు అంతా నవలల దిశగా పరుగులు తీస్తున్నారు.

ఆ మధ్య 'ఆహా'లో వచ్చిన 'మెట్రో కథలు' కూడా అలా కథను మోసుకొచ్చిందే. ఇక  ఇప్పుడు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన '9 గంటలు'  కూడా నవల్లో నుంచి కథ తెచ్చుకున్నదే. చాలా కాలం క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తి  రాసిన  నవల ఇది.

అప్పట్లో పత్రిక లో వచ్చిన ఈ కథ అందరినీ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. గతంలో యండమూరి .. మల్లాది .. కొమ్మనాపల్లి ..  యద్దనపూడి .. మధుబాబు .. పానుగంటి .. సూర్యదేవర మొదలైన రచయితలు ఎన్నో నవలలు రాశారు. నవలలు చదువుతుంటేనే దృశ్యం కళ్లముందు కదలాడేది. ఎంతోమంది రచయితలు రాసిన కథలు కావలసినన్ని ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ  కార్పొరేట్ సంస్థల ముందున్న పని,  సినిమాకి ఏది వర్కౌట్ అవుతుంది .. వెబ్ సిరీస్ కి ఏది  పనికొస్తుందని చూసుకుని రైట్స్ తీసుకోవడమే.
Tags:    

Similar News