పడుచు పాటకి పరుగులు నేర్పిన బప్పీలహరి!

Update: 2022-02-16 08:33 GMT
బప్పీలహరి .. సినీ సంగీత సామ్రాజ్యంలో ఒక సంచలనం. పాటకి ఉత్సాహమనే ఊపిరి పోసిన స్వరాల రారాజు. పాటకి పడుచుదనం తెచ్చిన గాయకుడు కూడా. బప్పీలహరి పాటకి ఊపును .. ఉత్సాహాన్ని .. ఉత్తేజాన్ని ఇచ్చిన పేరు. భాష ఏదైనా పదాలను పరిగెత్తిస్తూ పాటకు హుషారుదనాన్ని తెచ్చిన పేరు. బాలీవుడ్ నుంచి మారుమూల పల్లెలకు డిస్కోపాటను పరిచయం చేస్తూ, మనసు మనసుకి మరింత యవ్వనాన్ని తీసుకొచ్చిన పేరు. ఆయన స్వరాలు .. వినోదాల విహారాలు .. ఆనందాల ఆహారాలు.

అప్పటివరకూ ఒక మార్గంలో వెళుతున్న బాలీవుడ్ పాటను బహు దర్జాగా దారి మళ్లించినవారాయన. దక్షిణాదిన ఇళయరాజా రాజ్యమేలుతుండగా, తనదైన ప్రత్యేకతను అద్భుతంగా ఆవిష్కరించిన వారాయన. బెంగాల్ రాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లీదండ్రులిద్దరూ సంగీతంలో ప్రవేశం ఉన్నవారే కావడంతో, సహజంగానే ఆయనకి మ్యూజిక్ పై మక్కువ కలిగింది. వయసుతో పాటు సంగీతంపై ఆయనకి గల ఆసక్తి పెరుగుతూ పోయింది. ఇక అప్పటి నుంచి ఆయన పాటల పాయసాన్ని వడ్డించడం మొదలుపెట్టారు.

బాలీవుడ్ లో బడా మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకోవడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. తెలుగులో 'సింహాసనం' సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ ఆయనను పరిచయం చేశారు. 'ఆకాశంలో ఒక తార' అంటూ ఆ సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఆ సినిమా విజయంలో ఆయన పాటలు ముఖ్యమైన పాత్రను పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బప్పీలహరిని తెలుగులో చిరంజీవి ఎక్కువగా ఎంకరేజ్ చేశారు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో ముందుగా వచ్చిన సినిమా 'స్టేట్ రౌడీ'. ఈ సినిమాలో 'రాధా రాధా మదిలోన మన్మథ బాధ' అంటూ ఆయన తన బాణీలతో చిరంజీవి వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నించారు. ఇక 'గ్యాంగ్ లీడర్' సినిమాలో ఒక వైపున చిరంజీవి విశ్వరూపం కనిపిస్తే .. మరో వైపున బప్పీలహరి చేసిన స్వరాల విన్యాసం వినిపిస్తుంది. ప్రతి పాట ఒక ఎనర్జీ డ్రింక్ లా ప్రేక్షకులపై పనిచేసింది. ముఖ్యంగా 'వానా వానా వెల్లువాయే' పాట, తెలుగులో వచ్చిన బెస్ట్ వానపాటల్లో ఒకటిగా కనిపిస్తుంది.

ఇక 'రౌడీ అల్లుడు' సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలిపిన క్రెడిట్ కూడా బప్పీలహరి దక్కించుకున్నారు. 'చిలుకా క్షేమమా' అనే పాట ఇప్పటికీ జనం నాల్కులపై నాట్యం చేయడానికి కారకులు బప్పీలహరినే. ఆ పాటలో బీట్ వెంట ఇప్పటికీ అనేక మనసులు అలుపులేకుండా పరుగెడుతూనే ఉన్నాయి. ఇక ఫాస్టు బీట్లు మాత్రమే కాదు. శృంగార రసంతో కూడిన మెలోడీ పాటలను ట్యూన్ చేయడంలోనూ తనకి తిరుగులేదని ఆయన నిరూపించుకున్నారు. అందుకు ఉదాహరణగా ఈ సినిమాలోని 'కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో' అనే పాట వినిపిస్తుంది.

ఇక చిరంజీవి 'బిగ్ బాస్' సినిమాలోను 'మావా మావా' .. 'ఉరుమొచ్చేసిందోయ్' వంటి పాటలు .. మాస్ ఆడియన్స్ పల్స్ ఆయనకి బాగా తెలుసును అనడానికి నిదర్శనాలు. ఇలా తెలుగు పాటను కొత్తదారిలో .. కొత్త తీరులో పరుగులు తీయించిన బప్పీలహరి, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత రాత్రి కన్నుమూశారు. ఆయన మరణవార్త వినగానే హుషారైన పాట డీలాపడిపోయింది. వివిధ భాషలకి చెందిన సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఆయనతో తనకి గల అనుబంధాన్ని గురించి చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అలాంటి సంగీతదర్శకుడిని కోల్పోవడం సినీ సంగీత ప్రపంచానికే తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News