50 రోజుల దిశగా 'అఖండ' .. ఇంకా హౌస్ ఫుల్ బోర్డులే!

Update: 2022-01-16 11:08 GMT
ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయిందని చెప్పుకోవడానికి నిదర్శనం ఏమిటంటే ఆ సినిమా 100 రోజులు ఆడటం. ఆ సందర్భంగా ఫంక్షన్లు ఏర్పాటు చేసి షీల్డులు ఇవ్వడం ఒక సందడి .. ఒక సంబరం. అయితే అప్పట్లో థియేటర్లు తక్కువగా ఉండటం వలన 100 రోజులు ఆడేవి .. అందరూ టౌన్లకొచ్చి సినిమా చూడటానికి కొంత సమయం పట్టేదనే టాక్ ఉంది.    ఇప్పుడు పెద్ద సినిమాలు సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో ఒకే రోజున విడుదలవుతున్నాయి. అందువలన ఇప్పుడు 100 రోజులు ఆడే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో థియేటర్ కి ఏ సినిమా వచ్చినా పట్టుమని పది రోజులు ఆడితే అదే గొప్ప విషయమని అనుకునే పరిస్థితి వచ్చేసింది. దాదాపు ఏ సినిమాకి కూడా రిపీట్ ఆడియన్స్ లేకపోవడం మరొక విషయం. అయితే అలాంటి అభిప్రాయాలతో పాటు .. పాత రికార్డులను కూడా 'అఖండ' తుడిచి పారేసింది. వచ్చే వారంలో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకోబోతోంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి రూపొందించిన ఈ సినిమాకి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.

డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది. ఎప్పుడూ మాస్ యాక్షన్ ను తెరపై ఆవిష్కరించే బోయపాటి, ఈ సారి దానికి దైవత్వాన్ని కూడా జోడించడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ విరగబడి చూశారు. దాంతో బాలయ్య కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. 'పుష్ప' రంగంలోకి దిగిన తరువాత ఈ సినిమా జోరు తగ్గవచ్చని అనుకున్నారు .. 'శ్యామ్ సింగ రాయ్'తో వసూళ్లు మరింత తగ్గొచ్చని భావించారు.  

కానీ అలాంటివేం జరగలేదు. ఇక 'బంగార్రాజు' బరిలోకి దిగుతున్నాడు కనుక, ఈ సినిమా వసూళ్లపై ఎఫెక్ట్ పడొచ్చని చెప్పుకున్నారు. కానీ పండుగ రోజుల్లో 'అఖండ' చాలా ప్రాంతాలలో .. చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాంతో సినిమా విడుదలై 45 రోజులు అయినప్పటికీ ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు దర్శన మిస్తుండటం పట్ల అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో థియేటర్లను దడదడలాడించిన ఘనత 'అఖండ'కే దక్కుతుందేమో!   
Tags:    

Similar News